మత్తడివాగు ప్రాజెక్టు
-
కుడి వైపు కొత్త కాలువ నిర్మించాలని నిర్ణయం
-
మరో 1,200 ఎకరాల ఆయకట్టు సాగులోకి
-
నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సాగునీటి రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మత్తడివాగు ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ కాలువ నిర్మాణం ద్వారా అదనంగా 1,200 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురావచ్చని నీటి పారుదల శాఖ భావిస్తోంది. దీంతో తాంసి, తలమడుగు మండలాల పరిధిలోని పొన్నారి, కొడ«ద్, హస్నాపూర్ తదితర గ్రామాల పరిధిలోని రైతులకు మేలు జరుగనుంది.
తాంసి, తలమడుగు మండలాల పరిధిలోని 9,700 ఎకరాల బీడు భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ మత్తడివాగు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.55 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా సుమారు ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే.. ఈ ప్రాజెక్టుకు కుడి కాలువ నిర్మాణం చేపట్టడం ద్వారా అదనంగా 1,200 ఎకరాలను సాగులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కుడి కాలువతోపాటు, రెండు డిస్ట్రిబ్యూటరీలను కూడా నిర్మించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది. మరోవైపు ఈ కుడి కాలువ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 36 ఎకరాలను సేకరించాలని భావిస్తున్నారు. నిధులు మంజూరైతే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, కాలువ నిర్మాణం పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
చివరి ఆయకట్టుకు కూడా..
కాగా.. ప్రధాన కాలువ ద్వారా ప్రస్తుతం చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. 14వ డిస్ట్రిబ్యూటరీకి రైల్వే లైను అడ్డు రావడంతో ఆదిలాబాద్ మండలం జందాపూర్ వద్ద ఈ డిస్ట్రిబ్యూటరీ పనులు నిలిచిపోయాయి. దీంతో రైల్వేలైనుకు మరోవైపు ఉన్న చివరి ఆయకట్టు సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ ఆరు వందల ఎకరాలను కూడా సాగులోకి తెచ్చేందుకు రైల్వే క్రాసింగ్ పనులు చేపట్టింది. మరో నెల రోజుల్లో ఈ రైల్వే క్రాసింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
అనుమతి వచ్చిన వెంటనే పనులు
జిల్లాలో విరివిగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ కింద ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశాలున్నాయి. వెంటనే పనులు ప్రారంభిస్తాం.
– శ్రీనివాస్, పర్యవేక్షక ఇంజినీర్, నీటి పారుదల శాఖ