అన్నవరానికి త్వరలో కొత్త ఈఓ!
రెవెన్యూశాఖకు ప్రస్తుత ఈఓ నాగేశ్వరరావు సరెండర్?
ప్రచారంలోకి త్రినాథరావు, రఘునాథ్ పేర్లు
అధికారపార్టీ నేతల ముమ్మర ప్రయత్నాలు
అన్నవరం : అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును ఆయన మాతృ విభాగం రెవెన్యూ శాఖకు సరెండర్ చేయాలా లేక మరో ఆరు నెలలు ప్రస్తుత పదవిలోనే కొనసాగించాలా అనే దానిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికారపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయనను పంపించి, దేవాదాయశాఖకు చెందిన అధికారిని ఈఓ గా నియమించాలని సీఎంను కోరగా, ఆయన అందుకు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.
రెవెన్యూ శాఖలో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను 2015 జూలై రెండో తేదీన దేవస్థానం ఈఓగా ప్రభుత్వం నియమించింది. 2016 జూలై రెండో తేదీకి ఏడాది కాలపరిమితి పూర్తవడంతో మరో ఏడాది డెప్యుటేషన్ పొడిగించింది. దీంతో వచ్చే జూలై రెండో తేదీతో ఆయన కాలపరిమితి ముగియనుంది. తన డెప్యుటేషన్ పూర్తవుతున్నందున తనను రెవెన్యూ విభాగానికి సరెండర్ చేయాలని ఆయన దేవాదాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ, కమిషనర్ ను గతంలో కోరారు. అయితే 2018 మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆయన మరో ఆరు నెలలు ఇక్కడే కొనసాగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది.
పంపించేయాలని నేతల ప్రయత్నాలు:
అయితే ఇటీవల కాలంలో ఈఓ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడం, అధికారపార్టీకి చెందిన మెజార్టీ నేతలు కూడా తమకు సరైన గౌరవ మర్యాదలు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఆయనను కొనసాగించే విషయమై అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి తోడు రెవెన్యూ విభాగానికి చెందిన అధికారి ఈఓగా వస్తే దేవస్థానంలో ఎటువంటి అభివృద్ది జరగడం లేదని, ఏడేళ్లుగా ఇదే పరిస్థితి అని కొంతమంది అధికారపార్టీ నాయకులు సీఎంకు వివరించినట్లు సమాచారం.
ఈఓగా త్రినాదరావు లేదా రఘునాద్..?
ద్వారకా తిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావు లేదా పెనుగంచిప్రోలు దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎం.రఘునాథ్ ఇద్దరిలో ఒకరిని అన్నవరం దేవస్థానం ఈఓగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. త్రినాథరావు గతంలో జిల్లాలో డీసీ పనిచేయగా, రఘునా«థ్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓ గా పనిచేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధకశాఖ గతంలో దాడులు చేసింది. ఆ కేసులో ఆయనకు క్లీన్‌చిట్ లభించిందని చెబుతున్నారు.