సత్యగిరి ప్రదక్షిణకు కొత్త రహదారి
అన్నవరం : కార్తికమాసం పౌర్ణమి పర్వదినం ఈ నెల 14న అన్నవరంలో సత్యగిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం కొత్త రహదారిని సిద్ధం చేశారు. సత్యదేవుడు, అమ్మవార్లను రత్నగిరి, సత్యగిరి కొండల చుట్టూ భక్తులు సుమారు 12 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తుంటారు. గతేడాది నిర్వహించిన గిరి ప్రదక్షిణకు సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. సోమవారం రావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ గిరి ప్రదక్షిణకు వస్తారన్న అంచనాతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొత్త రహదారిని నిర్మించారు. ఇంతవరకూ ఈ ప్రదక్షిణ సత్యగిరి కొండల వెనక పంపా నదీ గర్భం నుంచి సాగేది. అయితే ఈ సారి పంపా నదిలో నిండుగా నీరు ఉండడంతో నదికి ఎగువ ఉన్న మామిడి తోట నుంచి ఉండేలా రహదారిని నిర్మించారు. ఈసారి గిరి ప్రదక్షిణకు ఒక కిలోమీటర్ తగ్గిందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ రోడ్డు పనులను దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని డీఈ రామకృష్ణ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ రహదారిని చదును చేసే పనులు రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. ఆ రోడ్డు మధ్యలో పొలాలు, తోటలు ఉన్న రైతులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు.