
నుజ్జునుజ్జయిన కారులో చిక్కుకున్న వారిని వెలుపలకు తీస్తున్న దృశ్యం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కట్టా శ్రీనివాసులు (30), ముందు సీట్లో కూర్చున్న దొమ్మేటి పవన్‌కుమార్ (33) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న గుత్తుల బాలు, దొమ్మేటి వెంకటేష్ గాయపడ్డారు. మృతులు శ్రీనివాసులుది జిల్లాలోని అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం. పవన్‌కుమార్‌ది అంబాజీపేట.
గాయపడిన ఇద్దరిలో దొమ్మేటి వెంకటేష్‌ది అంబాజీపేట కాగా, గుత్తుల బాలుది విశాఖ జిల్లా గాజువాక. శనివారం రాత్రి కాకినాడలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరైన ఈ నలుగురూ కారులో విశాఖపట్నం బయలుదేరారు. తెల్లవారుజామున 4.30 గంటలకు అన్నవరంలోని మండపం జంక్షన్ ముందున్న వై జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఖాళీస్థలంలో ఉన్న పెద్ద బండరాయిని బలంగా ఢీకొంది. అనంతరం రెండు పల్టీలు కొట్టి, పది మీటర్ల అవతల రోడ్డు మీద బోల్తా పడింది. మృతి చెందిన, గాయపడిన నలుగురూ 30–35 మధ్య వయసు వారే. కోనసీమలో పుట్టిన వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment