
మళ్లీ వస్తానమ్మా అంటూ వెళ్లి ...
నవ దంపతులను బలిగొన్న కారు
స్కానింగ్‌కు వెళ్లొస్తుండగా దుర్ఘటన
బీచ్ రోడ్డులో నేమాం వద్ద సంఘటన
చూపులు కలిశాయి. మనసులూ ఒక్కటయ్యాయి. పెళ్లి బంధంతో తమ ప్రేమకు సార్థకత చేకూర్చాలని ఆశపడ్డారు. పెద్దల అంగీకారంతో.. మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ప్రపంచంలో తమకంటే అదృష్టవంతులు లేరని మురిసిపోయారు ఆ నవ దంపతులు. అంతా సాఫీగా, ఆనందంగా సాగిపోతుందనుకున్న వారి జీవితాల్లో విధి వక్రీకరించింది. పెళ్లి జరిగి మూడు నెలలు ముగియకుండానే ఆ దంపతులను మృత్యువు కాటేసింది. కాకినాడ బీచ్ రోడ్‌లో నేమాం వద్ద ఆదివారం మోటార్ బైక్‌ను కారు ఢీకొన్న సంఘటనలో నవ దంపతులు దుర్మరణం పాలయ్యారు.
తూర్పు గోదావరి జిల్లా : కొత్తపల్లికి చెందిన కొండేటి నరేష్(27), రవీంద్రపురానికి చెందిన భాగ్యలక్ష్మి(22) ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మార్చి 23న వీరికి వివాహమైంది. పిఠాపురంలో నరేష్ ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా రెండు నెలల నుంచి భాగ్యలక్ష్మి కడుపు నొప్పితో బాధపడుతోం ది. కొన్ని రోజులుగా పిఠాపురంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపిస్తున్నారు. శనివారం ఉదయం నొప్పి తీవ్రం కావడంతో, పిఠాపురంలో వైద్యుడి వద్దకు భార్యాభర్తలు వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు, స్కానింగ్ తీసి, వ్యాధి నిర్ధారించాల్సి ఉందని చెప్పారు.
దానిని బట్టి మందులు వాడితే, నయమవుతుందని పేర్కొన్నారు. కాకినాడలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లాలంటూ లెటర్ రాసిచ్చారు. శనివారం సాయంత్రం కావడంతో ఆ దంపతులు ఆగిపోయారు. ఆదివారం ఉదయం వర్షం కురుస్తున్నా, మోటార్ బైక్‌పై వారిద్దరూ కాకినాడకు వెళ్లి స్కానింగ్ తీయించి, రిపోర్టు తీసుకున్నారు. కొత్తపల్లిలో బంధువుల ఇంట్లో భోజనం చేశాక, వైద్యుడి వద్దకు వెళదామనుకున్నారు.
ఈ క్రమంలో కాకినాడ నుంచి బీచ్ రోడ్డు మీదుగా కొత్తపల్లికి బైక్‌పై పయనమయ్యారు. కాకినాడ రూరల్ మండలం నేమాం సమీపంలో, అన్నవరం నుంచి ఉప్పాడ మీదుగా కాకినాడ వెళుతున్న కారు వారి బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయమైన నరేష్ అక్కడికక్కడే చనిపోయాడు. కొన ఊపిరితో ఉన్న భాగ్యలక్ష్మిని స్థానికులు కాకినాడ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
ప్రేమను జయించి.. మృత్యువుకు తలవంచి..
ప్రేమను సార్థకత చేసుకుని, జీవితాంతం కలిసుండడానికి మూడుముళ్ల బంధమే పునాది అవుతుంది. దీనికి ఇరువర్గాల పెద్దల ఆశీస్సులు అవసరం. వీటన్నింటిలోనూ ఆ ప్రేమజంట జయించారు. పెద్దల ఆశీర్వాదంతో మూడుముళ్ల బంధంలో తమ జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. అయితే.. మృత్యువు ముందు వారు తలవంచక తప్పలేదు. కాకినాడ బీచ్ రోడ్డులో కారు ఢీకొని నవ దంపతులు నరేష్, భాగ్యలక్ష్మి మరణించిన విషాద సంఘటన వారి బంధువులను తీవ్రంగా కలచివేస్తోంది. దీంతో వారి స్వగ్రామాలైన కొత్తపల్లి, రవీంద్రపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొంతకాలంగా నరేష్, భాగ్యలక్ష్మి ప్రేమించుకున్నారు. రవీంద్రపురానికి చెందిన మావూరి ఉమామహేశ్వరికి ఎవరూ లేకపోవడంతో, బంధువుల కుమార్తె అయిన భాగ్యలక్ష్మిని పెంచుకుంది. తల్లి అనుమతి లేనిదే తాను పెళ్లి చేసుకోనని భాగ్యలక్ష్మి స్పష్టం చేయడంతో, నరేష్ అందుకు అంగీకరించాడు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇరువర్గాల పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తమ వివాహానికి సహకరించాలని కోరారు.
ఇరువర్గాల పెద్దలు వారి ప్రేమకు తలవంచారు. ఈ ఏడాది మార్చి 23న వీరికి పెళ్లి చేశారు. తన సంపాదనతోనే కుటుంబాన్ని పోషించాలన్న తపనతో నరేష్ సొంతంగా పిఠాపురంలో వస్త్ర దుకాణం ప్రారంభించాడు. కారు రూపంలో మృత్యువు వారిని కబళించింది. తన బిడ్డ ఇలా విడిచిపెట్టి వెళ్లిపోతాడనుకోలేదని నరేష్ తండ్రి సత్యనారాయణ రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.
కంటికిరెప్పలా అల్లారుముద్దుగా పెంచిన కూతురు.. ‘మళ్లీ వస్తానమ్మా’ అంటూ వెళ్లి, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందనుకోలేదని భాగ్యలక్ష్మి తల్లి ఉమామహేశ్వరి గుండెలవిసేలా విలపించింది. బిడ్డ మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేని నరేష్ తల్లి రత్నంను బంధువులు ఓదార్చలేకపోయారు.