కుటుంబ సభ్యులతో హీరో నిఖిల్
అన్నవరం : రత్నగిరాదీశుడు సత్యదేవునిపై సినిమా తీస్తే తాను నటించడానికి సిద్ధమని వర్ధమాన హీరో నిఖిల్ తెలిపారు. తాను సత్యదేవుని భక్తుడినని, ఏటా ఏదో ఒక సమయంలో అన్నవరం వస్తానని చెప్పారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన శనివా రం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ తన తొలి సినిమా అన్నారు. ఆ తరువాత స్వామిరారా, యువత, వీడు తేడా, కార్తికేయ తదితర సినిమాల్లో నటించినట్టు తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న కొత్త సినిమా కోసం హెయిర్‌స్టైల్ మార్చుకున్నట్టు చెప్పారు. భక్తి సినిమాలలో నటించడం తనకు చాలా ఇష్టమని, కార్తికేయ సినిమాలో నటించడం సంతృప్తి నిచ్చిందన్నారు. అయితే హ్యాపీడేస్ సినిమా తనకు పేరు తెచ్చిందని వివరించారు. ఆలయ సూపరింటెండెంట్ డీవీఎస్ కృష్ణారావు ఆధ్వర్యంలో పండితులు వారికి వేదాశీస్సులు అందజేసి స్వామివారి ప్రసాదాలను బహూకరించారు.