భాషేదైనా భావం ముఖ్యమన్న విషయాన్ని నిరూపించింది ఈ సీజన్ బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో విన్నర్ గా కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. 22 మంది కంటెస్టెంట్స్ తో 105 రోజుల హోరాహోరీగా జరిగిన పోరాటంలో అజేయంగా నిలిచాడు. మొదటి ఎపిసోడ్ నుండీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే వస్తున్నాడు నిఖిల్. ఓ దశలో ఫస్ట్ రన్నరప్ గౌతమ్ గట్టి పోటీ ఇచ్చినా చివరికి విజయం మాత్రం నిఖిల్‌నే వరించింది. ఫైనల్ ఎపిసోడ్ లో టాప్ 5 గా నిలిచిన అవినాష్, ప్రేరణ, ముందుగా ఎలిమినేట్ అయ్యి టాప్ 3లో నబీల్, గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఈ ముగ్గురిలో విన్నర్‌గాల్‌ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున.
ఈ సీజన్లలో ప్రత్యేకత ఏంటంటే విన్నర్ పరభాషా నటుడవడం. ఆదివారం ప్రసారమైన గ్రాండ్ ఫినాలే యధావిధిగా ఆర్భాటంగా జరిగింది. ఈ సీజన్ లో పలు సెలబ్రిటీస్ తో పాటు ఫినాలేలో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా రావడం ఎపిసోడ్ కే హైలైట్. ఇక ఈ సిజన్ విశ్లేషణకొస్తే.. 14మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌజ్‌లోకి తర్వాత మరో 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తంగా 22 మంది పార్టిసిపెంట్స్ తో 15 వారాలు ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ అనేది ప్రపంచ ప్రేక్షకాదరణ పొందిన కాన్సెప్ట్. అటువంటిది తెలుగులోనూ విశేష ఆదరణ లభించింది. ఇదే ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నెం.1గా నిలబెట్టింది.
అన్ని సీజన్లకు మాదిరిగానే ఈ సీజన్ లోనూ పార్టిసిపెంట్స్ మధ్య వాడి, వేడి టాస్కులతో సెగలు పుట్టించగా.. హోస్ట్ నాగార్జున వారాంతంలో వీరి ఆట తీరుపై విశ్లేషణతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు. నత్తి మెదడు, మగళై, కుట్టి వంటి పదాలు ఈ సీజన్‌లో పార్టిసిపెంట్స్ మధ్య బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సీజన్‌ని ఫాలో అయ్యే ప్రేక్షకులకు రొటీన్ టాస్కుల పరంగా కాస్తంత అసహనం కలిగించినా సెలబ్రిటీలతో సీజన్ కవర్ చేయడానికి బాగానే ప్రయత్నించారు. బిగ్ బాస్ టీవి షోనే అయినా దీని తాకిడి మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.
సోషల్ మీడియాలోనే పార్టిసిపెంట్స్ పరంగా గ్రూపులతో పాటు కార్యక్రమంలోని అంశాలపై రోజువారీ చర్చలు జరిగాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి కావలసిందీ ఇదే. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కువగా యాంకరింగ్ చేసింది నాగార్జునే. తన ఛరిష్మాతో ఇటు పార్టిసిపెంట్స్‌ను అటు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. పార్టిసిపెంట్స్ గొడవ ఓ ఎత్తయితే ఆ గొడవకు సంబంధించిన నాగార్జున విశ్లేషణ మరో ఎత్తు. దీని కోసమే చాలా మంది వెయిట్ చేసేవారు.
మామూలుగా అపరిచితులతో ప్రయాణం చేసేటప్పుడు జరిగే చిన్నపాటి ఘర్షణ తలెత్తినా చుట్టూ పదిమంది గుమిగూడి గొడవ సద్దుమణిగేదాకా సినిమా చూసినట్టు చూస్తారు. అలాంటిది 22 మంది అపరిచితులను వంద రోజులకు పై ఓ ఇంట్లో పెట్టి వారి మధ్య టాస్కులు పెడితే ఆ బొమ్మ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ ఒకే స్క్రీన్ మీద 22కు పైగా సినిమాలను చూసినట్టుండేది.. అదే బిగ్ బాస్. ఈ సీజన్ తో బిగ్ బాస్ కార్యక్రమానికి కామా పడింది. మరో సీజన్ సినిమా కోసం ప్రేక్షకులు మరో 9 నెలలు వెయిట్ చేయాల్సిందే. వచ్చే సీజన్ వరకు ఈ సీజన్ వేడి మాత్రం చల్లారేదేలే. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికీ అస్సలు తగ్గేదేలే.
- హరికృష్ణ ఇంటూరు
Comments
Please login to add a commentAdd a comment