నిజామాబాద్‌లో మొక్కుబడిగా హరితహారం
చంద్రశేఖర్‌కాలనీ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రాష్ట్రమంతటా విజయవంతంగా కొనసాగుతుంటే, జిల్లా కేంద్రంలో మాత్రం తూతూ మంత్రంగా జరుగుతోందని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి విమర్శించారు.
చంద్రశేఖర్‌కాలనీ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రాష్ట్రమంతటా విజయవంతంగా కొనసాగుతుంటే, జిల్లా కేంద్రంలో మాత్రం తూతూ మంత్రంగా జరుగుతోందని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ చేయాలనే సదాశయంతో చేపట్టిన హరితహారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మినహా అన్ని నియోజకవర్గాల్లో దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. జిల్లా కేంద్రంలోని నలువైపులా గల ప్రధాన రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అర్బన్ ఎమ్మెల్యే, మేయర్ ఐదారు మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులిస్తున్నారనే తప్ప కేసీఆర్ ఆశయ సాధనకనుగుణంగా మొక్కలు నాటడంపై శ్రద్ధ కనబరచడం లేదని ధ్వజమెత్తారు. అక్రమ వసూళ్ల (పంచుకోవడం, ఎంచుకోవడం)పై చూపుతున్న శ్రద్ధ నగరమంతా మొక్కలు నాటడంపై, ఇంకుడు గుంతల ఏర్పాటుపై, రోడ్ల మరమ్మతులపై, పార్కుల ఏర్పాటుపై చూపడం లేదని ఆరోపించారు. జిల్లా అధికారులు ఉండే జిల్లా కేంద్రంలో హరితహారం కింద కనీసం కోటి మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినప్పటికీ నామమాత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ హరితహారంపై ఎప్పకటిప్పుడు సమీక్షించడమే కాక వారు స్వయంగా పల్లెపల్లెల్లో మొక్కలు నాటిస్తున్నారని తెలిపారు. కాకపోతే నిజామాబాద్ అర్బన్‌లోనే హరితహారం మొక్కుబడిగా సాగుతుందని పోశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు ఈర్ల శేఖర్, కోనేరు సాయికుమార్ పాల్గొన్నారు.