పోరుమామిళ్ల: తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నారని, ఆ పార్టీలోకి బయటి నుంచి వెళ్లి ఎవరు చేరతారని బద్వేలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జయరాములు ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రాభవం తగ్గుతోందన్నారు. అన్నివర్గాల ప్రజులు అసంతృప్తితో రగిలిపోతున్నారని జయరాములు చెప్పారు. మంత్రులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతుండటంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. టీడీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలువలకు కట్టుబడి ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఓ సర్పంచ్ తండ్రిని టీడీపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లి సర్పంచ్ టీడీపీలో చేరాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ తండ్రి కూడా టీడీపీలో చేరలేదని స్పష్టం చేశారు.
'టీడీపీలో ఎవరూ చేరరు'
Published Fri, Feb 19 2016 10:05 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement