‘బయట’కు చెప్పుకోలేక.. | no napkins in govt schools | Sakshi
Sakshi News home page

‘బయట’కు చెప్పుకోలేక..

Published Sat, Aug 6 2016 11:43 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

‘బయట’కు చెప్పుకోలేక..

‘బయట’కు చెప్పుకోలేక..

►హైస్కూళ్లు, కేజీబీవీల్లో నేప్కిన్ల పంపిణీ కరువు
►ప్రతి‘నెలా’ బాలికల తిప్పలు–‘ఆ రోజుల్లో’ సెలవుతో ‘సరి’

అయ్యో..ఆ సమస్య బయటకు చెప్పుకోలేక..అందుబాటులో నేప్కిన్లు లేక..ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లోని యుక్తవయస్సు ఆడపిల్లలు అవస్థ పడుతున్నారు. నేప్కిన్ల పంపిణీ నిలిచి..పేద బాలికలు కొనలేక, మరికొందరు అవగాహన లేక నెలసరి వచ్చినప్పుడు బడికి దూరమవుతున్నారు. అమ్మ ఆలనకు దూరంగా ఉండి చదువుకుంటున్న అమ్మాయిలు..‘ఆ రోజుల్లో’ కుమిలిపోతున్నారు. సర్కారు కనికరించి..గతంలో మాదిరి నేప్కిన్ల పంపిణీ కొనసాగించాలని దీనంగా వేడుకుంటున్నారు.

కొత్తగూడెం రూరల్‌:
సున్నిత అంశం..పట్టింపు శూన్యం
జిల్లాలో మొత్తం 333 హైస్కూళ్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 22,340 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాలు 26 ఉండగా 5,200 మంది చదువుతున్నారు. యుక్తవయస్సు ఆడపిల్లలకు ప్రతి నెలా నెలసరి అప్పుడు నేప్కిన్లు అవసరం. గతంలో ప్రభుత్వమే సరఫరా చేసేది. కానీ రెండేళ్లుగా వీటి పంపిణీ నిలిచింది. నేప్కిన్లు ఉంటే నెలసరి సమస్యను అధిగమించి పాఠశాలల్లో చదువుకోవచ్చు. కానీ..అవి లేక..ప్రధానంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థినులు చాలా మనోవేదనకు గురవుతున్నారు. బాధతో బడికి రాలేక ఇళ్లకు, హాస్టళ్లకు పరిమితమవుతున్నారు.

బడికి దూరం..లేదంటే భారం
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అవగాహన లేదు.  నెలసరి క్రమంలో డబ్బు పెట్టి నెప్కిన్లు కొనే స్థోమత లేని అమ్మాయిలు అనేకమంది ఉన్నారు. ప్రతి నెలా ఐదు రోజుల పాటు పాఠశాలకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఇంకొందరు అమ్మాయిలైతే..ఈ సమస్య బాధతోనే బడిని మానేస్తున్నారని కూడా తెలుస్తోంది. పదో తరగతి చదివే వారు ఇలా..కొన్ని రోజుల పాటు పాఠశాలకు రాకుంటే..జరిగిన పాఠాలు అర్థంకాక.. ఆ ప్రభావం వార్షిక పరీక్షలపై పడే అవకాశం ఉంది.

‘కస్తూర్బా’లో అవస్థ..
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో మధ్యలో బడిమానేసిన, తల్లితండ్రి లేదా, ఇద్దరింట్లో ఎవరోఒకరు లేనివారే ఎక్కువ మంది చదువుకుంటున్నారు. సెలవులొస్తే..తమవారంటూ లేక..ఇళ్లకు వెళ్లలేక విద్యాలయంలోనే ఉండి కుమిలిపోతుంటారు. వీరికి పౌష్టికాహారం అందించి, విద్యాబుద్ధులు నేర్పాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పటికీ..కనీస బాధ్యతను విస్మరించడం పట్ల బాలికలు బాధపడుతున్నారు. గతంలో మాదిరి నేప్కిన్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

నిధులు లేక నిలిచింది..
బాలికలకు నేప్కిన్ల పంపిణీ నిలిచిపోయింది. రాజీవ్‌ విద్యామిషన్‌లో నిధుల కొరత వల్లే ఈ సమస్య నెలకొంది. గతంలో నేప్కిన్లు పంపిణీ జరిగేది. తిరిగి వీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తాం.
–వెంకటనర్సమ్మ, కొత్తగూడెం డిప్యూటీ డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement