-
నిరుపయోగంగా కోస్టల్ మెరైన్ పోలీస్ స్టేషన్
-
పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు
-
పట్టించుకోని అధికారులు
వాకాడు:
జిల్లాలో విస్తారంగా ఉన్న తీర ప్రాంతంలో నిఘూ కొరవడింది.ఒక వైపు ఉగ్రవాదుల ముప్పు ఉన్నా రక్షణ చర్యల్లో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రజలు అంటున్నారు. రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు 1750 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో విస్తరించింది. నెల్లూరు జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో 165 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం ఉంది. కావలి, బోగోలు, అల్లూరు, విడవతలూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్ళూరుపేట, తడ మండలాల పరిధిలో తీర ప్రాంతం పొడవున ప్రజలు నివశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అంతరిక్ష పరిశోధనా కేంద్రం కూడా ఉంది. ఈ తీర ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు, స్మగ్లర్లు, నక్సలైట్లు చొరబడే అవకాశం ఉంది.
నిరుపయోగంగా మెరైన్ పోలీస్ స్టేషన్లు:
తీర ప్రాంతాల్లో అక్రమ చొరబాటు దారులను నివారించేందుకు జిల్లాలో అల్లూరు మండలం ఇస్కపల్లి, సూళ్ళూరుపేట మండలం శ్రీహరికోట, మరోకటి వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద కోస్టల్ సెక్యూరిటీ మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్‌లో ఒక సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, ఆరు మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్‌తో సహా 52 మంది సిబ్బంది ఉంటారు. వీరంతా తీర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుంటారు. దీంతో జల మార్గం నుంచి తీవ్ర వాధులు నక్సలైట్లు స్మగర్ల కదలికలను సునాయాసంగా కనిపెట్ట వచ్చునని ప్రభుత్వ ఉద్దేశ్యం. ఐతే దుగరాజపట్నంలో కోస్టల్ మెరైన్ పోలీస్టేషన్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో సరైన నిఘా ఉండడంలేదని తీర ప్రాంతం ప్రజలు విమర్శిస్తున్నారు.
కోట, వాకాడులో 32 కిలో మీటర్ల తీరం:
కోట, వాకాడు మండలా పరిధిలో 32 కిలో మీటర్ల పొడవున 39 తీర ప్రాంత గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలు నివశిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న పరిణామాల్లో తీర ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కు లమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
గస్తీ నిర్వహిస్తున్నాం -దుగరాజపట్నం మెరైన్ సీఐ కిషోర్‌బాబు
తీర ప్రాంత సరిహద్దు, సముద్రంలో మూడు బోట్ల ద్వారా 8 మంది సిబ్బందితో 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నాం. తమ పోలీస్టేషన్ పరిధిలో ఉన్న 39 గ్రామాల్లో దశలవారిగా మత్స్యకారులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం.