vakadu
-
35 గ్రామాలకు ఉప్పునీరే దిక్కు ..
సాక్షి, వాకాడు: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మండలంలోని 35 తీర ప్రాంత గ్రామాల్లో గత ఐదేళ్లుగా ఉప్పు జలగండం పట్టి పీడిస్తోంది. నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. తీరప్రాంత వాసులకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో 68 గ్రామాల్లో 10.5 వేల కుటుంబాలు, 38 వేల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 204 చేతి పంపులు ఉండగా, వాటిలో 164 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. నిడిగుర్తి, రెడ్డిపాళెం, బాలాజీ నగర్, నిమ్మవానితిప్ప, వేణుగోపాల్‌పురం, నిడిగుర్తి గొల్లపాళెం, శ్రీహరిపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, దుగ్గరాజపట్నం, కొత్తూరు, అంజలాపురం, కాకివాకం, పంబలి, నిడిగుర్తి, శ్రీపురం, తీపలపూడి, మూలపడవ, రాజ్యలక్ష్మీపురం, మొనపాళెం, వైట్‌కుప్పం, నలగామల, పున్నమానితిప్ప, నిడిగుర్తి గొల్లపాళెం, రెడ్డిపాళెం, మాధవాపురం, ముట్టెంబాక, కల్లూరు, దుర్గవరం, పల్లెపాళెం ఇలా 35 గ్రామాల్లో వేసవి వస్తే సరి త్రాగునీరు ఉప్పునీరుగా మారిపోయి ప్రజలు అల్లాడుతుంటారు. ఐతే వీరి గురించి అధికార పక్షం నాయకులు గానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. వీరికి సురక్షిత మంచినీరు అందించేందుకు వాకాడు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన పాత పైలెట్ ప్రాజెక్టు పట్ల పాలకులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు సక్రమంగా అందడంలేదు. అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోయి మరమ్మత్తులకు గురైనప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా తీర గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు ద్వారా నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులు, దాతల చందాలతో మంచినీరు దొరికే ప్రాంతాల్లో గ్రామస్తులే బోరు పాయింట్లు నిర్మించుకుని తాగునీరు తెచ్చుకుంటున్నారు. తీరప్రాంత గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఉప్పునీరు పనికిరాదు. మండలంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కొరకు వాకాడు స్వర్ణముఖి వద్ద మరో మంచినీటి ప్రాజెక్టు నిర్మించాలని మండల ప్రజలు కోరుచున్నారు. తాగేందుకు ఉప్పునీరే గతి స్నానాలు చేయాలన్నా.. వంట చేసుకోవాలన్నా ఉప్పునీరు కావడంతో చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్లు తాగి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడైనా పట్టణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా త్రమే మంచినీళ్లు తాగుతున్నాం. మిగిలిన సమయంలో ఉప్పునీరే తాగుతున్నాం.– నల్లపురెడ్డి మునస్వామిరెడ్డి, వేణుగోపాలపురం ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం గ్రామాల్లో లభిస్తున్న ఉప్పునీరు కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం. సిమెంటులో ఉప్పునీరు కలిపితే నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. మండలంలోని 35 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. – మునస్వామి, ఓడపాళె ఆందోళన చేసినా పట్టించుకోలేదు గ్రామంలో తాగునీరు ఉప్పునీరుగా మారి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అనేక సార్లు ఆందోళన చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉప్పునీరు తాగే బతుకుతున్నాం.– పోలయ్య మత్స్యకార కాపు, కొండూరుపాళెం -
పోరు గాలి.. వేట ఖాళీ
సాక్షి, వాకాడు: సముద్రంపై ప్రతికూల వాతావరణం కారణంగా 25 రోజులుగా పోరు గాలి వీస్తుండడంతో వేట సజావుగా సాగడం లేదు. సాధారణంగా మార్చిలో మత్స్యసంపద ఎక్కువగా దొరుకుతుందని గంగపుత్రులకు ఎంతో కాలం వస్తున్న నమ్మకం. అలాంటిది ఈ సారి మార్చి ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా పోరుగాలి తగ్గకపోవడంతో మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో వలేసి గాలించినా ఒక్క చేపైనా దొరకపోగా శ్రమతోపాటు, డీజిల్, కూలీలు ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో వేట తప్ప మరేపని తెలియని మత్స్యకారులు పూట గడవక ఆకలితో అలమటిస్తున్నారు. వేటే జీవనాధారంగా చేసుకుని తెల్లవారు జామునే వల బుజాన వేసుకుని సముద్రాన్ని గాలించి మంచి మత్స్యసంపదతో సంతోషంగా కనిపించే సాగర పుత్రులు తీరంలో దిగాలు చెందుతున్నారు. ఒడ్డుకు పరిమితమైన బోట్లు ఇటీవల పలు జిల్లాలో వచ్చిన వరుస తుపాన్లు, ప్రతికూల వాతావరణం వెరసి వేట నిలిచిపోయి బోట్లు ఒడ్డుకు పరిమితమయ్యాయి. ఇంతకు ముందు మాదిరిగా సముద్రంలో మత్స్య సంపద విరివిగా దొరకడంలేదు. ఎందుకంటే దాదాపు నెల రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సముద్రంపై పోరు గాలి నెలకుని బోట్లు తిరగబడుతున్నాయి. దీంతో డీజిల్ ఖర్చులు వృథా చేసుకుని మత్స్యకారులు పోయిన దారినే వెనుతిరిగి వచ్చేస్తున్నారు. దానికితోడు తీరంలో నెలకొని ఉన్న పలు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు కండలేరు క్రీక్‌లోకి వదిలి, క్రీక్ నుంచి సముద్రంలో కలవడంతో వాకాడు, కోట, చిల్లకూరు, మండలాల తీర ప్రాంతాల్లో మత్స్య సంపద పూర్తిగా నసించిపోయి మత్స్యకారులు జీవనం కోల్పోతున్నారు. రోజంతా సముద్రంపై గాలించినా మత్స్యకారులకు శ్రమ తప్ప ఫలితం దక్కడంలేదు. దీంతో వేట కొరకు తెచ్చిన పెట్టుబడుల రుణాలకు వడ్డీలు కట్టలేకున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2,650 మంది వేటకెళ్లే మత్స్యకారులు నియోజకవర్గం పరిధిలోని వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో 24 మత్స్యకార గ్రామాల్లో 2,650 మంది వేట చేసే మత్స్యకారులు, 1,920 బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటుపై యజమానులతోపాటు కూలీలతో కలిపి దాదాపు మూడు నుంచి ఐదు కుటుంబాల వరకు మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేట లేకపోవడంతో బోట్లు ఒడ్డుకు చేర్చి లంగరు వేసి ఉన్నాయి. ప్రస్తుతం మత్స్యకార కుటుంబాలు అప్పులు చేసి పూట గడుపుతున్నా, మరికొందరు పస్తులుంటున్నారు. ఈ పరిస్థితి అన్ని మండలాల మత్స్యకార గ్రామాల్లో నెలకొని ఉంది. వేటనే నమ్ముకుని కుటుంబాన్ని పోషించే కొందరు మత్స్యకారులు ఎంచేయాలో దిక్కుతోచక వివిధ పనుల్లో దినసరి కూలీలుగా మారుతున్నారు. ఇది ఇలా ఉంటే గత ఏడాది విధించిన వేట విరామం డబ్బులు ఇంతవరకు సక్రమంగా అందకపోవడం, వచ్చిన డబ్బుల్లో కూడా మధ్యవర్తులు దండుకోవడం కనిపిస్తోంది. కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపలవేట లేక, చేతిలో పనిలేక కాలక్షేపం కోసం కొన్ని వ్యసనాలకు బానిసలవుతున్నారు. తమను అన్ని విధాలా ఆదుకుంటున్నామని పదే పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు. తమ బాధలు గుర్తించి వెంటనే సాయం అందించాలని మత్సకారులు కోరుతున్నారు. రోజంతా గాలించినా చేపలు దొరకడంలేదు నెల రోజులుగా సముద్రంపై పోరుగాలి కొడుతుండడంతో రోజంతా గాలించినా ఒక్క చేప కూడా దొరకడంలేదు. దీంతో పూట గడవక మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వారం నుంచి కూలికి వెళ్లి జీవనం సాగిస్తున్నాం. – సోమయ్య మత్స్యకారుడు, తూపిలిపాళెం -
త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నా..
-
పంబలిలో భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు
వాకాడు : సినీ నిర్మాత, దివంగత ఎస్.గోపాల్‌రెడ్డి తనయుడు ఎస్.భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలిలో నిర్వహించారు. భార్గవ్‌రెడ్డి సముద్రంలో మునిగి మంగళవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. పంబలిలోని తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, రాజేశ్వరమ్మ సమాధుల వద్దనే భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. భార్గవ్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరి పావని తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆమే అంత్యక్రియలు నిర్వహించారు. తన చేతులతో అన్నకు తల కొరివి పెట్టాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. హీరో విశాల్ తల్లిదండ్రులు జీకే రెడ్డి, జానకీ దేవి, సోదరి ఐశ్వర్యరెడ్డి, సినీ నటుడు చిన్నాతోపాటు పలువురు సినీ నటులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తీరం.. నిఘా దూరం
నిరుపయోగంగా కోస్టల్ మెరైన్ పోలీస్ స్టేషన్ పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు పట్టించుకోని అధికారులు వాకాడు: జిల్లాలో విస్తారంగా ఉన్న తీర ప్రాంతంలో నిఘూ కొరవడింది.ఒక వైపు ఉగ్రవాదుల ముప్పు ఉన్నా రక్షణ చర్యల్లో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రజలు అంటున్నారు. రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు 1750 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో విస్తరించింది. నెల్లూరు జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో 165 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం ఉంది. కావలి, బోగోలు, అల్లూరు, విడవతలూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్ళూరుపేట, తడ మండలాల పరిధిలో తీర ప్రాంతం పొడవున ప్రజలు నివశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అంతరిక్ష పరిశోధనా కేంద్రం కూడా ఉంది. ఈ తీర ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు, స్మగ్లర్లు, నక్సలైట్లు చొరబడే అవకాశం ఉంది. నిరుపయోగంగా మెరైన్ పోలీస్ స్టేషన్లు: తీర ప్రాంతాల్లో అక్రమ చొరబాటు దారులను నివారించేందుకు జిల్లాలో అల్లూరు మండలం ఇస్కపల్లి, సూళ్ళూరుపేట మండలం శ్రీహరికోట, మరోకటి వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద కోస్టల్ సెక్యూరిటీ మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్లో ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలు, ఆరు మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్‌తో సహా 52 మంది సిబ్బంది ఉంటారు. వీరంతా తీర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుంటారు. దీంతో జల మార్గం నుంచి తీవ్ర వాధులు నక్సలైట్లు స్మగర్ల కదలికలను సునాయాసంగా కనిపెట్ట వచ్చునని ప్రభుత్వ ఉద్దేశ్యం. ఐతే దుగరాజపట్నంలో కోస్టల్ మెరైన్ పోలీస్టేషన్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో సరైన నిఘా ఉండడంలేదని తీర ప్రాంతం ప్రజలు విమర్శిస్తున్నారు. కోట, వాకాడులో 32 కిలో మీటర్ల తీరం: కోట, వాకాడు మండలా పరిధిలో 32 కిలో మీటర్ల పొడవున 39 తీర ప్రాంత గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలు నివశిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న పరిణామాల్లో తీర ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కు లమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గస్తీ నిర్వహిస్తున్నాం -దుగరాజపట్నం మెరైన్ సీఐ కిషోర్‌బాబు తీర ప్రాంత సరిహద్దు, సముద్రంలో మూడు బోట్ల ద్వారా 8 మంది సిబ్బందితో 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నాం. తమ పోలీస్టేషన్ పరిధిలో ఉన్న 39 గ్రామాల్లో దశలవారిగా మత్స్యకారులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
వాకాడు : అనునాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందాడు. మండలంలోని తూపిలిపాళెం బీచ్ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సుధాకర్, తన సిబ్బందితో సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి నాలుగు రోజులు క్రితం చనిపోయి ఉండొచ్చునని, తీరానికి వచ్చి మద్యం తాగి దాహార్తితో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు ఆరెంజ్ కలర్లో సన్నగడుల చొక్కా, పూతల లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
వాకాడు : ఉరేసుకుని వస్త్ర వ్యాపారి మండలంలోని చినతోట సమీపంలో ఉన్న జామాయిల్ తోటలో మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా నగిరి ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారి బండి బుజ్జయ్య (56) చినతోట ప్రాంతంలో లుంగీలు తెచ్చి అమ్మేవాడు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా కలహాలు ఏర్పడటంతో బుజ్జయ్య చినతోటలోనే ఉండేవాడు. ఈ క్రమంలో తాను అమ్మే లుంగీతోనే జామాయిల్ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న వాకాడు ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన సెల్ నంబర్ ఆధారంగా పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
వాకాడు: వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన చందన, కస్తూరయ్యలు కొంతకాలంగా ప్రేమించుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఐతే వీరిద్దరి కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఈ ప్రేమజంట ఇంటి నుంచి వెళ్లిపోయి ఈ నెల 26న జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల వారు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఆ మేరకు జిల్లా ఎస్పీ వాకాడు పోలీసులకు అప్పజెప్పారు. దీంతో వాకాడు ఎస్ఐ సుధాకర్ ప్రేమ జంట ఇద్దరు మేజర్ కావడంతో ఇరువర్గాల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమ జంటను కొన్నాళ్ళు అబ్బాయి బంధువుల వద్ద ఉండాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలిసింది. -
'తొలిగా నక్సల్స్‌పై నిషేధం విధించిన నేదురుమల్లి'
హైదరాబాద్ : నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించారు. 1992 మేలో నక్సల్స్‌పై నిషేధం విధిస్తూ ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నేదురుమల్లి నక్సలైట్ల హిట్‌లిస్ట్‌లో చేరారు. సెప్టెంబర్ 7 2007లో జనార్ధనరెడ్డి ప్రయాణిస్తున్న కారును పేల్చివేసేందుకు నక్సల్స్ ప్రయత్నించారు. ఈ ఘటనలో నేదురుమల్లి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి నుంచి తృటిలో ప్రాణాపాయంతో బయటపడగా, ముగ్గురు కార్యకర్తలు మరణించారు. 2003లోనూ ఇదే తరహా దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి 1935 ఫిబ్రవరి 20న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించారు. నెల్లూరులో బీఏ, బీఈడీ చదివారు. 1962 మే 25న రాజ్యలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు. నేదురమల్లి రాజ్యలక్ష్మి సైతం 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన నేదురుమల్లి రాజకీయ ప్రస్థానం 1972లో ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత పీసీసీ సెక్రటరీగా పనిచేశారు. 1978లో శాసనసభకు పోటీచేసిన నేదురుమల్లి... మంత్రివర్గంలో స్థానం పొందారు. ఆ తర్వాత 1988లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. చెన్నారెడ్డి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనార్ధనరెడ్డి... దాదాపు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 1998, 99లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1999 నుంచి మూడేళ్లపాటు అతి ముఖ్యమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 2004లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వ్డ్గా ఉన్న నెల్లూరు లోక్‌సభ జనరల్‌గా మారడంతో... పోటీచేయాలని భావించినా ఆయనకు సీటు లభించలేదు. ఫలితంగా మరోసారి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.