కృష్ణమ్మ కట్టడి | No water come from krishna river to ap state | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ కట్టడి

Published Sun, May 15 2016 3:49 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

కృష్ణమ్మ కట్టడి - Sakshi

కృష్ణమ్మ కట్టడి

సాక్షి, హైదరాబాద్: కృష్ణానదిపై మహారాష్ట్ర, కర్ణాటక వందకు పైగా ప్రాజెక్టులు, బ్యారేజ్‌లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడంతో.. దిగువనున్న రాష్ట్రాలకు చుక్కనీరు రాని పరిస్థితి ఏర్పడింది. అన్ని అడ్డంకులు దాటుకొని శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు చేరినా.. వచ్చిన నీటిని వచ్చినట్లు తోడేయడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయంపై అక్రమంగా 120 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తోంది. అది కూడా ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం వద్ద నుంచే నీటిని తోడుకోవడానికి వీలుగా లిఫ్ట్‌లను డిజైన్ చేసింది.

శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ప్రాజెక్టులో 854 అడుగుల మట్టం ఉన్నప్పుడే రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటిని అందించే వెలిగొండ ప్రాజెక్టులకు నీరు అందుతుంది. అంతకంటే 54 అడుగుల దిగువన.. అంటే 800 అడుగుల నుంచే తెలంగాణ రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని తోడటం మొదలు పెడితే.. రాయలసీమ జిల్లాలతో పాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని అందించం సాధ్యం కాదు. 833 అడుగుల వద్ద ఉన్న హెచ్‌ఎచ్‌ఎన్‌ఎస్‌కూ నీరందే అవకాశం లేకుండా పోతుంది.
 
భారీ వరదలు రాకుంటే.. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వద్దకు చుక్క నీరు చేరదు. అదే జరిగితే... సాగర్ ఆయకట్టుతో పాటు కృష్ణా డెల్టా కూడా ఎడారిగా మారిపోతుంది. కృష్ణానదిపై ఆధారపడిన ఆయకట్టు మొత్తం దారుణంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నా.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను గట్టిగా అడ్డుకొని, కృష్ణానీటిపై ఏపీకి ఉన్న హక్కులను కాపాడాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతుంటే గట్టిగా నిలదీసి నీటిపై హక్కును కాపాడుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా మెతక వైఖరి అవలంబిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ‘ఓటుకు కోట్లు’ కేసు, అనుమతులు తీసుకోకుండా కమీషన్ల మీద కక్కుర్తితో హడావుడిగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొంతు పెగలకుండా అడ్డం పడ్డాయనేది నిష్ఠుర సత్యం. ఎగువ రాష్ట్రానికి భయపడి మెతక వైఖరి అనుసరించడం ద్వారా ప్రజల హక్కులను మన ప్రభుత్వమే కాలరాసింది. కృష్ణమ్మ గలగల పారే అవకాశం లేకుండా చేసింది.  
 
 పంటలు కనుమరుగు!
 రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కృష్ణా డెల్టా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా నది ఆధరువు. కానీ.. ఎగువన మహారాష్ట్ర మొదలు కర్ణాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు, ఇప్పుడు తాజాగా తెలంగాణ చేపడుతున్న అక్రమ లిఫ్ట్‌ల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నీరు దక్కే అవకాశాలు కనిపించకుండా పోతున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల్లోనే బందీ అయిన కృష్ణమ్మ.. వరద వచ్చినప్పుడు కాస్త అయినా దిగువకు వచ్చిన నీటిని తెలంగాణ తోడేస్తుంటే.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు లేకపోతే.. కరువుతో అల్లాడిపోతున్న రాయలసీమ జిల్లాల గొంతు తడపడం సాధ్యమయ్యే పని కాదు.

శ్రీశైలం నిండకపోతే.. దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతుంది. దాని కింద ఉన్న పులిచింతల దాటుకొని ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ నీరు చేరుతుందా? కృష్ణా డెల్టాలో కనుచూపు మేరంతా కనిపించే వరి చేలు మళ్లీ కనిపిస్తాయా? కృష్ణమ్మను ఎగువనే ఒడిసిపట్టుకుంటుంటే.. దిగువ ఆంధ్రప్రదేశ్ ఏడాదిగా మారిపోతుందనే ఆందోళనల ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. సాగు, తాగు నీటి హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని సాగునీటి రంగం నిపుణులు సూచిస్తున్నారు.
 
 పోలవరం నుంచి 80 టీఎంసీలు
 పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తీసుకురావడానికి వీలుగా పోలవరం కుడికాల్వను వేగంగా దాదాపు పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది. కృష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు.. పోలవరం ప్రాజెక్టులో నిల్వ ఉంచి నీటిని కృష్ణా డెల్టా అవసరాల మేరకు కుడికాల్వ ద్వారా విడుదల చేసి డెల్టాను కాపాడటానికి సాహసోపేతంగా పోలవరం ప్రాజెక్టును వైఎస్ ప్రారంభించిన విషయం విదితమే.

నమ్మకంగా నీరందించడానికి వీలు లేని విధంగా, ఎలాంటి నిల్వసామర్థ్యానికి అవకాశం లేకపోయినా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారు. అనుమతులు లేకుండా చేపట్టిన ఫలితంగా.. తెలంగాణ కూడా అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా.. నిలదీయలేని అశక్తుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలను ఎగువ రాష్ట్రానికి తాకట్టుపెట్టాల్సిన వచ్చిం దని సాగునీటి శాఖ ఇంజనీర్లు విమర్శిస్తున్నారు.
 
 టెయిల్‌పాండ్ కుదింపు
 గోదావరి నీటిని దుమ్ముగూడెం ద్వారా నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌కు తరలించి సాగర్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వం రీడైజన్ పేరిట దుమ్ముగూడెం నుంచి టెయిల్‌పాండ్‌ను తప్పించింది. ఫలితంగా సాగర్ స్థిరీకరణకు గండి పడింది.
 
 కలిసి కొట్లాడితేనే ఫలితం.. కానీ..
 ఎగువ రాష్ట్రాలు అక్రమంగా నీటిని నిల్వ చేసుకుంటున్నా.. ఎత్తిపోతల పథకాల ద్వారా తోడుకుంటున్నా.. అవన్నీ అధికారిక గణాంకాల్లో కనిపించవు. కట్టడి చేయడానికి దిగువ ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎగువ రాష్ట్రాలపై ఒత్తిడి తేవడం, న్యాయపోరాటాలు చేయాలి. కానీ తెలంగాణ కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను కట్టడి చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోరు రావడం లేదు. ఇంక ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టుల గురించి ఏం మాట్లాడగలదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
 
 వచ్చిన నీటినీ తోడేస్తే..
 వరదలు వచ్చి ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండిన తర్వాతైనా దిగువకు వచ్చే నీటిని శ్రీశైలంలో నిల్వ కాకుండా ఎప్పటికప్పుడు అక్రమంగా తోడేస్తే..? ఇదే పని చేయడానికి ఇప్పుడు తెలంగాణ 135 టీఎంసీల భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా 90 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల ద్వారా 30 టీఎంసీలు, కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా 20 టీఎంసీలు.. మొత్తం కలిపి 135 టీఎంసీలు తోడుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టింది. భారీ వరదలు ముంచెత్తిన సంవత్సరాల్లో అయితే.. శ్రీశైలం ప్రాజెక్టు నిండి, దిగువన ఉన్న నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వరకు నీరు చేరుతుంది.

అప్పుడు కూడా వర్షాకాలం ముగిసిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల మట్టాన్ని కాపాడితేనే.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. 800 అడుగుల వద్ద నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తెలంగాణ తోడేస్తే.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగునీటినీ ఇవ్వడం సాధ్యం కాదని, కరువు ప్రాంతం గొంతు తడవటం కలగానే మిగిలిపోతుందనే ఆందోళన సాగునీటి శాఖ ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది.
 
800 అడుగుల నుంచే లిఫ్ట్‌
శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ మట్టం వద్ద గరిష్టంగా 215 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ప్రాజెక్టులో 854 అడుగులు మట్టం ఉంటే తప్ప రాయలసీమకు నీరివ్వడం సాధ్యం కాదు. రాయలసీమకు నీటిని తీసుకొనే ప్రధాన మార్గం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. దీని సిల్ లెవల్ 840 అడుగులు. ప్రాజెక్టులో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎక్కుతాయి. వెలిగొండ ప్రాజెక్టుకు నీరివ్వాలన్నా.. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలి. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ రోజూ 2 టీఎంసీల నీటిని తోడితే.. ఆమేరకు ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం ఎగువ నుంచి వస్తుంటేనే నీటిమట్టం పడిపోకుండా ఉంటుంది.

పోతిరెడ్డిపాడు, వెలిగొండకు నీరివ్వాలంటే.. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కనీసం 4-5 టీఎంసీలు ఉండాలి. కృష్ణలో ఈ స్థాయిలో 60 రోజుల పాటు వరద ఉండే అవకాశం కనిపించడం లేదు. ఎగువన భారీ వరదలు వచ్చినా 20 రోజులకు మించి ఉండే అవకాశం లేదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఏపీ పాలిట శాపంగా మారనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 కృష్ణానది స్వరూపం
 కృష్ణానది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నదుల్లో రెండోస్థానంలో ఉంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ సమీపంలో పుట్టిన కృష్ణా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా 1435 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కోయినా, ఘటప్రభ, మలప్రభ, దూద్‌గంగ, తుంగభద్ర తదితర ఉప నదులు కృష్ణాకు కుడి వైపున, భీమా, మూసీ, మున్నేరు లాంటి ఉప నదులు ఎడమ వైపున కృష్ణానదిలో కలుస్తాయి.

కృష్ణా బేసిన్‌లో 536 రిజర్వాయర్లు ఉన్నాయి. అందులో శ్రీశైలం అతిపెద్దది కాగా.. ఆల్మట్టి(కర్ణాటక), ఉజ్జెయిని(మహారాష్ట్ర), నాగార్జున సాగర్(ఏపీ-టీఎస్ ఉమ్మడి ప్రాజెక్టు), తుంగభద్ర(ఏపీ-కర్ణాటక ఉమ్మడి ప్రాజెక్టు), భద్ర(కర్ణాటక) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  
 
 కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టుల సంఖ్య
 ఈ ప్రాజెక్టుల్లో 1,748.27 టీఎంసీల లైవ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. ఇవన్నీ అధికారిక గణాంకాలు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కృష్ణా, దాని ఉప నదుల మీద ఎక్కడికక్కడ బ్యారేజీలు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. నదులపై వంతెనలు నిర్మించిన ప్రతి చోటా తక్కువ సామర్థ్యంతో అయినా.. బ్యారేజీలు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేస్తున్నారు లేదా మళ్లిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 1748.27 టీఎంసీలే నిల్వ సామర్థ్యం అయినా.. ఎగువ రాష్ట్రాల్లో అనధికారిక లెక్కల ప్రకారం మరో 200 టీఎంసీల నిల్వ సామర్థ్యం అధికంగా ఉంటుందని నిపుణుల అంచనా.

ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రధాన జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులే. శ్రీశైలం, సాగర్ లైవ్ స్టోరేజ్ సామర్థ్యం 395 టీఎంసీలే. మిగతావన్నీ చిన్న ప్రాజెక్టులే. అధికారిక లెక్కల ప్రకారమే.. మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి కనీసం 1,300 టీఎంసీల నీరు చేరిన తర్వాతే దిగువకు నీరు వస్తుంది. వరదలు వచ్చిన సంవత్సరమే దిగువకు నీరు వస్తోంది. మిగతా సంవత్సరాల్లో కర్ణాటక దాటి నీరు రావడం లేదు. 2015లో చుక్కనీరు కూడా కృష్ణలో దిగువకు రాలేదు.
 
మేజర్ ప్రాజెక్టులు    76
 మీడియం ప్రాజెక్టులు    135
 ఈఆర్‌ఎం ప్రాజెక్టులు    10
 జల విద్యుత్ ప్రాజెక్టులు    30
 ఎత్తిపోతల పథకాలు    119
 (+ ఈఆర్‌ఎం: ఎక్స్‌టెన్షన్,
 రెనోవేషన్ అండ్ మోడర్నైజేషన్)
 
 పులిచింతల నిర్మాత వైఎస్
 కృష్ణా డెల్టాలో త్వరగా ఖరీఫ్ పంట సాగు చేయడానికి అవసరమైన నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద నిల్వ ఉండదు. రుతుపవనాలు సకాలంలో రాకపోతే.. స్థానికంగా వర్షాలు కూడా కురిసే అవకాశాలు లేవు. నీరు లేక ఖరీఫ్ సాగు చేయడంలో జాప్యం జరిగితే.. పంట కోతకు వచ్చే సమయంలో కోస్తాలో తుపానుల తాకిడి ఎక్కువగా ఉండి పంట నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.

ఈ సమస్యను అధిగమించడానికి, తీర ప్రాంతంలో సెలినిటీ సమస్య తలెత్తకుండా అడ్డుకోవడానికి వీలుగా సాగర్ దిగువన 45 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో పులిచింతల ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కేవలం 3 టీఎంసీల నిల్వ సామర్థ్యమే ఉన్నందున.. డెల్టా అవసరాలకు పులిచింతల నీటిని వినియోగించుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వల్ల కృష్ణాలో చుక్కనీరు దిగువకు రాకుంటే.. సాగర్ నిండి పులిచింతల చేరేదెలా? కృష్ణా డెల్టా చింతలు తీరేదెలా? అని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement