ఆ విశ్వవిద్యాలయంలో చుక్కనీరు ఉంటే ఒట్టు
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ మహిళా హాస్టల్‌లో రెండు రోజులుగా నీటికొరత తీవ్రంగా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి. తాగడానికి, బాత్‌రూమ్‌లో వాడకానికి నీరు లేవు. దీంతో మంగళవారం రాత్రి భోజనం తినేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థునులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రకాశం భవన్‌కు వెనుకవైపున ఉన్న మహిళ హాస్టళ్ళ సముదాయ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేశారు. హాస్టల్‌కు తీవ్ర నీటి కొరత ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
చాలారోజుల నుంచి హాస్టల్‌లో ఇదే పరిస్థితి ఉందని వార్డన్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 1000 మంది ఉన్న హాస్టల్‌లో 9 మంది మాత్రమే తాగునీటి కుళాయిలు ఉన్నాయని చెప్పారు. అలాగే గదికి ఇద్దరు ఉండాల్సిన రూముల్లో 7 నుంచి 9 మందికి కేటాయించారని చెప్పారు. దోమల భాద ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్‌లో భోజనం సరిగా లేదని ఆరోపించారు. సమస్యలను ఎన్నిసార్లు వార్డన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని చెప్పారు. వార్డన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. మహిళా హాస్టల్‌లో ఈ తరహా ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో రిజిస్ట్రార్ దేవరాజులు, హాస్టల్ ప్రాంగణానికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు శాంతించలేదు. దీంతో ఆయన నీరు తెప్పించే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ అంశంపై వార్డన్ శకుంతల మాట్లాడుతూ నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. నీటి కొరత విషయంలో తానేమీ చేయలేనిని పేర్కొన్నారు.