మొక్కుబడి తనిఖీలు
సాక్షి, గుంటూరు : నాలుగు రోజులుగా యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్న దాచేపల్లి క్లబ్ వ్యవహారంలో పోలీసులు మొక్కుబడి తనిఖీలు నిర్వహించారు. ‘పేకాటకు పచ్చజెండా’ శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో పోలీసు ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో క్లబ్‌లో తనిఖీలు చేసేందుకు వెళ్లిన పోలీసులు రోడ్డుపైనే మూడు గంటలపాటు పడిగాపులు కాశారు. క్లబ్‌లోకి వెళ్లేవారిని మొక్కుబడిగా తనిఖీలు చేశారు.
అధికార పార్టీ అండాదండా...
జిల్లాలో పేకాట నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. హైదరాబాదులో క్లబ్‌లన్నింటినీ పూర్తిగా మూయించటంతో అక్కడి నిర్వాహకులు ఆంధ్రా రాజధాని ప్రాంతంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రిక్రియేషన్ క్లబ్‌ల కోసం అనుమతులు తీసుకొని యథేచ్ఛగా జూదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా ఉండే కొందరు పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతలకు డబ్బు ఎర చూపి తమకు ఇబ్బంది లేకుండా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.