తిరుమల: ఆర్జిత సేవల్లో తిరుమలేశుడిని దర్శించుకునే భాగ్యం ఇక భక్తులందరికీ లభించనుంది. ఇంటర్నెట్ ద్వారా పొందే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నిబంధనల్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరింత కఠినతరం చేసింది. ఈ కొత్త నిబంధనలు ఈనెల 4 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఒకసారి టికెట్ పొందిన వ్యక్తి మళ్లీ ఆరు నెలల లోపు సేవా టికెట్లు పొందే అవకాశం ఉండదు. దీంతో సామాన్య భక్తులకూ సేవా టికెట్లు పొందే అవకాశం లభిస్తుంది. నిత్యం గర్భాలయ మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నిర్వహించే వివిధ రకాల ఆర్జిత సేవలకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే టికెట్లు ఇస్తారు.
వీటి కోసం భక్తుల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. 100 టికెట్లు ఖాళీ ఉంటే ఒక టికెట్ కోసం సుమారు 2వేల మంది పోటీపడుతుంటారు. ఒకసారి టికెట్లు పొందిన భక్తులే మళ్లీ మళ్లీ పొందుతున్నట్టు కూడా సర్వేలో తేలింది. దీన్ని గుర్తించిన టీటీడీ టికెట్ల విక్రయాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు భక్తుడి ఈమెయిల్ ఐడీ, గుర్తింపు కార్డు తీసుకుని టికెట్లు కేటాయిస్తుంది. తిరిగి ఆరునెలల్లోపు అలాంటి వాటితోనే టికెట్లు పొందకుండా చర్యలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల కొత్తవారికి టికెట్లు పొందే అవకాశం లభించనుంది.
ఏప్రిల్ నెలకు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
ఆర్జిత సేవా టికెట్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా తొంభై రోజులకొకసారి అర్ధరాత్రి వేళ విడుదల చేసే టికెట్ల కోటా విధానాన్ని రద్దుచేసి, ప్రతి నెలా విడుదల చేసే విధానాన్ని ఆరునెలల కిందటే అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నిర్వహించే ఆర్జిత సేవలకు సంబంధించి మొత్తం 50వేల టికెట్ల కోటాను విడుదల చేశారు. ఇందులో సుప్రభాతం 6,115, అర్చన 120, తోమాల 120, విశేష పూజ 1,500, అష్టదళ పాదపద్మారాధన 40, నిజపాద దర్శనం 1,125, కల్యాణోత్సవం 9,750, వసంతోత్సవం 10,320, బ్రహ్మోత్సవం 5,590, సహస్ర దీపాలంకారసేవ 12,350, ఊంజల్‌సేవ 2,600 టికెట్లు ఉన్నాయి.
ఆరునెలలకోసారి ఆర్జిత సేవా టికెట్లు
Published Mon, Mar 7 2016 10:09 PM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM
Advertisement
Advertisement