పౌష్టికాహారలోపమే ప్రధాన శత్రువు
పౌష్టికాహారలోపమే ప్రధాన శత్రువు
Published Wed, Sep 28 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
తరుచూ వ్యాధుల బారిన గిరిజన విద్యార్థులు
హాస్టళ్లలో అందని వైద్యం
అనారోగ్యంతో మరణాలు
రంపచోడవరం : ఏజెన్సీ ప్రాంత గిరిజన విద్యార్థులకు పాష్టికాహారమే ప్రధాన శత్రువుగా మారింది. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు తరచూ వ్యాధులు బారిన పడుతున్నారు. పాష్టికాహారం సక్రమంగా అందకపోవడంతో రక్తహీనతతో బాధపడుతున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఇందుకోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో కోత పడుతోంది. మెను అమలుతీరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది.
పర్సంటేజి పర్వానికి ముగింపు ఎప్పుడో?
ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ విద్యావిభాగంలో 86 ఆశ్రమ పాఠశాలలు, 18 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డైట్ బిల్లులు మార్చుకునేందుకు వివిధ దశల్లో వార్డెన్లు పర్సంటేజీలు చెల్లించక తప్పడం లేదు. ఈ క్రమంలో విద్యార్థులు ఎక్కువ ఉన్న హాస్టల్స్‌లో పనిచేసేందుకు వార్డెన్లు పోటీ పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆనార్యోగానికి గురైన విద్యార్థులను దగ్గరలోని పీహెచ్‌సీకి, అక్కడి నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ఎటువంటి నిధులూ కేటాయించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో డబ్బులు ఖర్చు పెట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు.
ఏఎన్‌ఎం నియమకాలు నిల్
ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు గతంలో ఏఎన్‌ఎంలు పనిచేసేవారు. అయితే ప్రస్తుతం ఏఎన్‌ఎంలు ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేయడం లేదు. గతంలో సర్వశిక్షాభియాన్ ద్వారా వారికి జీతాలు చెల్లించేవారు. ఏఎన్‌ఎంల నియామాలకు ఐటీడీఏ చొరవ చూపకపోవడం గిరిజన విద్యార్థులకు శాపంగా మారింది. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో పాఠశాల వార్డెన్లు డబ్బులు చెల్లించి ఏఎన్‌ఎంలను ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్యం బాగోలేకపోతే పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మందులు హెచ్‌ఎం, వార్డెన్‌లే ఇవ్వాలని అధికారులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. నెలవారీ విద్యార్థులకు నిర్వహించే వైద్య పరీక్షలు తూతూమంత్రంగా ముగుస్తున్నాయి. కొన్ని పాఠశాలలకైతే సమీపంలోని పీహెచ్‌సీ వైద్యులు వెళ్లడమే లేదు. ప్రతీ నెలా పదుల సంఖ్యలో గిరిజన విద్యార్థులు ఆనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను తొలగించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
Advertisement