పండ్ల తోటల్లో ‘అక్టోబర్’ యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ నెలలో పండ్లతోటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ఏ తోటలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలా వివరించారు.
మామిడి తోటల్లో...
– మామిడిని ఆశించే ఆకుమచ్చ, కొమ్మ ఎండు తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలి.
– బెరడు లేదా కాండం తొలిచే పురుగులను నివారించాలంటే రంధ్రాల్లో ఉన్న పురుగులను ఇనుప చువ్వలతో తీసివేయాలి. తర్వాత ఆ రంధ్రాల్లో డైక్లోరోవాస్ మందు ద్రావణం లేదా పెట్రోల్‌లో ముంచిన దూదిపెట్టి బంకమట్టితో మూసివేయాలి. చెట్లకు నీరు పెట్టడం ఆపేయాలి.
– పిండి పురుగులు గమనిస్తే 2 శాతం మిథైల్ పెరాథియాన్ పొడిమందు చల్లిన మట్టితో చెట్టు చుట్టూ కప్పేయాలి. వీటి పిల్లపురుగులు చెట్ల కాండం మీదకు పాకకుండా శీతాకాలంలో చెట్టు మొదళ్లకు భూమి నుంచి ఒక అడుగు ఎత్తులో ఒక అడుగు నిడివి కలిగిన పాలిథీన్ షీట్ కాండం చుట్టూ చుట్టి దానిపైన గ్రీసు పూయాలి. పైకిపోలేని పిల్ల పురుగులు గుంపులుగా గుమికూడతాయి. పదునైన చాకుతో వీటిని గీకివేసి నాశనం చేయవచ్చు. లేదంటే ఒక లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల పాస్ఫామిడాన్ కానీ, లేదా ఒక మిల్లీలీటరు డైక్లోరోవాస్ కానీ లేదా 0.3 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి.
సీతాఫలం తోటల్లో...
– ఫక్వానికి వచ్చిన సీతాఫలం కాయలను కోసేయాలి. కాయతొలిచే ఈగ ఆశించిన కాయలను, రాలిన కాయలను ఏరివేసి కాల్చిపారేయాలి. ఈగ ఆశించిన తోటల్లో మిథైల్ యూజినాల్ ఎరలు ఎకరాకు నాలుగైదు చొప్పున చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి.
అరటి తోటల్లో...
అరటి తోటల్లో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీరు పెడుతుండాలి. చెట్టు చుట్టూ వచ్చే పిలకలను ఎప్పటికప్పుడు తీసేయాలి. తెల్ల చక్కెరకేళి రకానికి మూడవ దఫా కింద 110 గ్రాముల యూరియా, 80 గ్రాముల ఎంవోపీ ఎరువు వేసుకోవాలి.
దానిమ్మ తోటల్లో...
దానిమ్మ తోటల్లో కత్తిరింపులు చేసిన తర్వాత సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేయాలి. కాపునకు వచ్చిన తోటల్లో ప్రతి మొక్కకూ సాలీనా 30 నుంచి 40 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ఎరువులు రెండు దఫాలుగా వేయాలి. మొదటి తడికి ముందు ఒకసారి, కాయ ఎదిగే దశలో మరోసారి వేసుకోవాలి. కొత్తగా వచ్చిన చిగుర్లపైన బ్యాక్టీరియా మచ్చతెగులు లక్షణాలు, శిలీంధ్ర మచ్చ తెగులు లక్షణాలు కనిపిస్తే పది లీటర్ల నీటికి 2.5 గ్రాముల స్ట్రెప్టోసైక్లీన్, 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి.