సాక్షి ప్రతినిధి కర్నూలు: వర్షాలపై ఆధారపడి అదృష్టాన్ని పరీక్షించుకునే రైతులకు ఏటా కచ్చితమైన ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొడి భూముల్లో ఉద్యాన పంటలు (డ్రై ల్యాండ్ హార్టీకల్చర్) కార్యక్రమం కింద రైతులకు మొక్కలు నాటే సమయం నుంచి 100 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు సాగు ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో రాష్ట్రంలో పండ్ల తోటలు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా రైతులు స్థిరంగా లాభాల పంటను పండిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను చూసి సంప్రదాయ పంటలు సాగు చేసే పొరుగు రైతులు కూడా పండ్ల తోటల సాగువైపు మళ్లుతున్నారు. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వమే దన్నుగా నిలుస్తుండటంతో దేశంలోనే ‘హార్టీ కల్చర్ హబ్’గా ఏపీ అభివృద్ధి చెందుతోంది.
నాలుగేళ్లలో 2.35 లక్షల ఎకరాల్లో..
2018–19 వరకూ రాష్ట్రంలో 17,62,240 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యేవి. ఆ విస్తీర్ణం ప్రస్తుతం 19,97,467.5 ఎకరాలకు సాగు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో 2,35,227.5 ఎకరాల్లో పండ్ల తోటల సాగు పెరిగింది. 2018–19లో 1,76,43,797 టన్నుల పండ్ల దిగుబడులు రాగా.. ప్రస్తుతం 2,03,70,557 టన్నులకు పెరిగింది. అంటే 27,26,760 టన్నుల దిగుబడి పెరిగింది. పండ్ల తోటలతో పాటు పూలు, కూరగాయలు కలిపి మొత్తం రాష్ట్రంలో 47.02 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిద్వారా 3.63 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయి.
ప్రస్తుత ఏడాది 2023–24లో రికార్డు స్థాయిలో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల అభివృద్ధికి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా పండ్ల తోటల సాగు, అభివృద్ధి మోతుబరి రైతులు మాత్రమే చేసేవారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుండటంతో సన్న, చిన్నకారు రైతులు కూడా పండ్ల తోటలను సాగు చేయగలుగుతున్నారు.
ఆ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పండ్ల తోటల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుండటం విశేషం. ఈ జిల్లాల్లో ప్రత్యేకంగా 10 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేస్తున్నారు. కాగా.. పొండి భూములు అధికంగా ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 వేల ఎకరాల్లోను, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది.
ఇక ‘లక్ష’ణంగా ఆదాయం!
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నర్సిరెడ్డి. ఈయనకు అర ఎకరం పొడి భూమి ఉంది. వర్షాధారంగా పత్తి, మిరప వంటి పంటలు సాగు చేసేవాడు. అన్నీ అనుకూలిస్తే.. ఏటా రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేది. వర్షాలు మొహం చాటేస్తే నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. 2020 వరకు ఇదే పరిస్థితి. 2021–22లో డ్రైలాండ్ హార్టీకల్చర్ స్కీమ్ కింద డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇచ్చింది. పొలంలో గుంతలు తవ్వడం నుంచి మొక్కల వరకూ పూర్తిగా ప్రభుత్వమే రూ.1.70 లక్షల ఖర్చు భరించింది. తొలి ఏడాది రూ.22 వేలు, రెండో ఏడాది రూ.55 వేల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.లక్ష దాటుతుందని నర్సిరెడ్డి చెప్పాడు. ఈ పంట సాగువల్ల ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంటుందంటున్నాడు.
రూ.750 కోట్లతో తోటల అభివృద్ధి
పండ్ల తోటల అభివృద్ధికి ఎకరాకు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ.2.44 లక్షల వరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. ఎకరాకు సగటున రూ.లక్ష వరకూ సబ్సిడీ ఇస్తోంది. 2023–24లో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది. మామిడి, చీనీ, నిమ్మ, కొబ్బరి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలను రైతులు అభివృద్ధి చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హార్టీకల్చర్ అభివృద్ధికి ఈ ఏడాది రూ.750 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి 64,544 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి అంచనాలు రూపొందించగా.. 63,250 ఎకరాలకు పరిపాలన అనుమతులు లభించాయి. మరోవైపు పండ్ల మొక్కలు నాటే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
రెండెకరాల్లో మామిడి సాగు
మాకు 2 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వర్షాధారం కింద ఆముదం, సజ్జ, కంది సాగు చేశాం. ఏ పంట వేసినా నష్టం తప్ప లాభం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో మామిడి మొక్కలు అందించింది. 2 ఎకరాల్లో 140 మామిడి మొక్కలు నాటుకున్నాం. కాపు వచ్చేదాకా 3–4ఏళ్లు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు.
ఏ ఖర్చు లేకుండా పండ్ల తోటలు సాగు చేశాం. సంతోషంగా ఉంది. కాపు వస్తే మా బతుకు మారుతుంది. – వై.లక్ష్మీదేవి, ప్యాపిలి, నంద్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment