అక్టోబర్‌ నుంచి ఫైబర్‌ నెట్‌ సేవలు | October onwards fibre net services in district | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ నుంచి ఫైబర్‌ నెట్‌ సేవలు

Published Sat, Aug 27 2016 8:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

సర్వర్‌ బాక్స్‌లు

సర్వర్‌ బాక్స్‌లు

* 90 శాతం సాంకేతిక పనులు పూర్తి
విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ల నుంచే ఫైబర్‌ నెట్‌ సిగ్నల్‌
రూ.149 కే కేబుల్‌ టీవీ, ఫోన్, ఇంటర్‌నెట్‌ సౌకర్యం
 
గుంటూరు (నగరంపాలెం): జిల్లాలో అతి తక్కువ ఖర్చుతో కేబుల్‌ టీవీ ప్రసారాలు, ఫోన్, ఇంటర్‌ నెట్‌ సౌకర్యం మరో నెలరోజుల్లోనే రానుంది. ప్రస్తుతం సగటు వినియోగదారుడు కేబుల్‌టీవీకి రూ.200, ఇంటర్‌నెట్‌ కమ్‌ ఫోన్‌కు రూ.800 కలిపి మొత్తం రూ.1000 ఖర్చు అవుతుండగా,ఈ సేవలన్నీ కలిపి కేవలం రూ.149కే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఫైబర్‌నెట్‌ వర్క్‌ సేవలు అక్టోబర్‌ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. అంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ విద్యుత్‌ డిస్కంలు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా  ఫైబర్‌ నెట్‌ పనులు ప్రారంభించారు. దీని కోసం విద్యుత్‌శాఖకు సంబంధించిన స్తంభాల మీదుగా ఆప్టికల్‌ ఫైబర్‌ వైరు ఏర్పాటు చేయడంతో పాటు సబ్‌స్టేషన్‌లలో సిగ్నల్‌ బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో  ఒక మాస్టర్‌ నోడ్‌ (కంట్రోల్‌ రూం), నాలుగు జోనల్‌ నోడ్‌లు, 52 మండలనోడ్‌లు,155 సిగ్నల్‌ స్టేషన్‌ (ఎస్‌ఎస్‌) నోడ్‌లు మొత్తం 211 విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో ఇప్పటికే సిగ్నల్‌ సర్వర్‌ నోడ్‌ ఏర్పాటు చేశారు. వీటిని కలుపుతూ నెట్‌వర్కింగ్‌ సిగ్నల్‌ కోసం  24 కోర్‌ సామర్ధ్యం ఉన్న  ఆప్టికల్‌ ఫైబర్‌ వైరు 2073 కి.మీ ఏర్పాటు చేశారు.  స్టేట్‌ రింగ్‌ నుంచి తీసుకున్న సిగ్నల్‌ గుంటూరు నగరంలో  ఏర్పాటుచేసిన  మాస్టర్‌ నోడ్‌కి, తెనాలి, బాపట్ల, పిడుగురాళ్ళ, నరసరావుపేట సబ్‌స్టేషన్‌లోని జోనల్‌ నోడ్‌కి వెళుతుంది. జోనల్‌ నోడ్‌ నుంచి వచ్చిన సిగ్నల్‌ మండల నోడ్‌ల ద్వారా ఎస్‌ఎస్‌ నోడ్‌లకు చేరుతుంది. ఇక్కడి నుంచే ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ తో అగ్రిమెంట్‌ చేసుకున్న  కేబుల్‌ ఆపరేటర్లు ద్వారా ఇళ్లకు కనెక్షన్లు అందిస్తారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో 100 కి.మీ మినహా 90 శాతం ఆప్టికల్‌ఫైబర్‌ పనులు  పూర్తయ్యాయి.
 
బేసిక్‌ ప్యాకేజీ నెలకు రూ.149..
ఫైబర్‌ నెట్‌ వర్క్‌ ద్వారా బేసిక్‌ ప్యాకేజీ కింద నెలకు రూ. 149కే కేబుల్‌టీవీ, ఫోన్, నెట్‌ సౌకర్యం రానుంది. టీవీలో 100 ఫ్రీ చానల్స్‌తో పాటు, 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 5 జీబీ ఇంటర్‌నెట్‌ డేటా, రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్‌ నెట్‌ వర్క్‌ ద్వారా ఫోన్‌ సౌకర్యం ఉన్న వారితో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లోకి వచ్చిన ఆప్టికల్‌ ఫైబర్‌ వైరుకు ఐపీటీవీ బాక్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా టీవీ, ఫోను, ఇంటర్‌నెట్‌ కోసం వైఫై సౌకర్యం పొందవచ్చు. పే చానల్స్‌ కోసం, ఎక్కువ డేటా, ఇతర ఫోన్‌లకు మాట్లాడుకోవడానికి త్వరలో ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ ద్వారా వచ్చే ఫోన్‌కు ప్రారంభంలో 797 నంబరును కేటాయించారు. ప్రభుత్వకార్యాలయాలకు, వాణిజ్య అవసరాల కోసం 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో నెట్‌ వర్క్‌ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 1350 ఎంఎస్‌వోలు (కేబుల్‌ ఆపరేటర్లు) సిగ్నల్‌ కోసం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు నగరం బ్రాడీపేటలో   పది రోజుల్లో జిల్లా కార్యాలయం ప్రారంభం కానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement