అధికారులు తప్పిపోయారా..?
అధికారులు తప్పిపోయారా..?
Published Wed, Aug 10 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
కౌటాల : నిత్యం రద్దీగా ఉండే కౌటాల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులు కనిపించలేదు. వివిధ పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన భాధితులకు చుక్కెదురైంది. అధికారుల రాక కోసం గంటల తరబడి వేచి చూసినా ఫలితం దక్కలేదు. తెలంగాణ రాష్ట్రంలోనైనా అధికారులు మంచి పాలన అందిస్తారనే ప్రజల నమ్మకాన్ని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది వమ్ము చేస్తున్నారు.
ఖాళీగా కుర్చీలు
ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు అటెండర్లు, కంప్యూటర్ అపరేటర్ విధులు నిర్వహిస్తారు. కానీ బుధవారం కార్యాలయంలో ఒక్క అటెండర్ తప్ప ఎవరూ కూడా విధులకు హాజరు కాలేదు. అలాగే మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సైతం కనిపించలేదు. కార్యాలయంలో కనీసం ఒక్క ఉద్యోగి అయినా అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారి మాట మండల ఉద్యోగులకు పట్టడం లేదు.
సిబ్బంది లేకపోవడంపై ఆరా తీయగా ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నా ఓ ఉద్యోగి ఇంట్లో బుధవారం గహా ప్రవేశ కార్యక్రమం ఉండడంతో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కొందరు శుభకార్యానికి, కొంత మంది వారి పనుల నిమిత్తం వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఎంపీడీవో రాజేశ్వర్‌ను సాక్షి సంప్రదించగా తాను విధుల్లో భాగంగా జిల్లా కేంద్రానికి వెళ్లినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆఫీసు సిబ్బంది విషయమై ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదన్నారు.
Advertisement