అధికారుల గైర్హాజరుపై అసహనం | officials embarrassed On absences | Sakshi
Sakshi News home page

అధికారుల గైర్హాజరుపై అసహనం

Published Sun, Aug 14 2016 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

అధికారుల గైర్హాజరుపై అసహనం - Sakshi

అధికారుల గైర్హాజరుపై అసహనం

  • సమీక్ష సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు
  • ‘దిశ’ తొలి సమావేశంలో ప్రజాప్రతినిధులు
  • కమిటీ మార్గదర్శకాలు తెలియజేయాలని ఎంపీ ఆదేశం
  •  
    హన్మకొండ : సమీక్ష సమావేశాలు, జిల్లా, మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరయ్యే అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధులు కోరారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశం మందిరంలో శనివారం ‘దిశ’ తొలి సమీక్ష సమావేశం జరిగింది. గతంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్‌ కమిటీ ఉండగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ(దిశ)గా మార్చింది. ఈ మేరకు కమిటీ సమావేశాలు ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్, ఫిబ్రవరిలో కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. అయితే, తొలి సమావేశాన్ని ఆగస్టు 13న నిర్వహించాలన్న సూచనలతో శనివారం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. అయితే, పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.
     
    సమావేశానికి రూ.2లక్షలు
    ‘దిశ’ కమిటీ మార్గదర్శకాలతో పాటు ఏయే శాఖలపై సమీక్ష ఉంటుందో వచ్చే సమావేశంలోగా అధికారులు, సభ్యులైన ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. ప్రతీ సమావేశానికి ప్రభుత్వం రూ.2 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఎంపీ సీతారాం నాయక్‌ తెలిపారు. ప్రజాప్రతినిధులకు రవాణ ఖర్చులు వీటి నుంచి చెల్లిస్తారన్నారు. ఈ కమిటీ పరిధిలోకి 28 శాఖలు వస్తాయని, వీటిపై ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షించనున్నట్లు చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు తిరిగి వచ్చేలా పార్లమెంట్‌ సభ్యులు కృషి చేయాలన్నారు. జిల్లాను అభివృద్ధి బాట పట్టిద్దామన్నారు. కాగా, సమావేశం ప్రారంభం కాగానే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ చేస్తున్న పనులన్ని కాగితాలపై లెక్కలుగానే మిగులుతున్నాయని, క్షేత్రస్థాయిలో కనపడడం లేదని విమర్శించారు.  మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ గ్రానైట్‌ లీజ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, తక్కుల విస్తీర్ణానికి రాయల్టీ చెల్లించి ఆక్రమణలకు పాల్పడుతు పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు దున్నపోతు మీద నీళ్లు పోసినట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
    మాకు అధికారాలు లేవా?
     
    ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు అధికారాలు లేకుండా పోయాయని సమావేశంలో పలువురు ఎంపీపీలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పలు కార్యక్రమాల వివరాలు చెప్పడం లేదని ఆరోపించారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ కలగజేసుకుని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎంపీపీలకు అందించాలని ఆదేశించారు. రక్షిత మంచినీ టి పథకా(సీడీడబ్ల్యూఎస్‌)ల విద్యుత్‌ బిల్లు లు చెల్లించడానికి నిధులు లేవని, దీంతో  పథకాలు మూసివేయాల్సి వస్తోందని  ఎంపీపీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. కేంద్రప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా జీపీలకు ఇస్తుండడంతో జెడ్పీలో నిధులు లేక ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా రాష్ట్రప్రభుత్వం బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో మూసివేస్తున్నట్లు బోర్డులు పెట్టాలని ఎంపీపీ రవీందర్‌రావు అనగానే... ఎంపీ సీతారాంనాయక్‌ సైతం బోర్డు పెట్టాలని అన్నారు. అనంతరం తేరుకున్న ఆయన నిధులు వచ్చేలా కృషి చేద్దామన్నారు. అనంతరం జేసీ జీవన్‌పాటిల్‌ మాట్లాడుతూ మండల సమావేశాలకు హాజరుకాని అధికారుల వివరాలు ఎంపీడీఓల ద్వారా తెప్పించుకుని వారిపై చర్య తీసుకోవాలని జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్‌ను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ ఆహ్మద్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డీఈఓ రాజీవ్, వ్యవసాయ శాఖ జేడీ ఉషాదయాళ్, పీఆర్‌ ఎస్‌ఈ సత్తయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ రాంచంద్, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శివరాం పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement