
పోలీసులతో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు
- పోడుదారులు, పోలీసుల మధ్య తోపులాట
- సొమ్మసిల్లి పడిపోయిన ఐదుగురు గిరిజనులు
కొత్తగూడెం రూరల్ : పోడు పోరు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అడవిని చదును చేసుకొని గిరిజనులు సాగు చేసుకుంటున్న పత్తి, సజ్జ మొక్కలను అటవీ శాఖ అధికారులు యంత్రాలతో దున్నించి.. ధ్వంసం చేశారు. దీంతో పోడుదారులు, అటవీ శాఖ అధికారుల మధ్య తోపులాట జరగగా.. ఐదుగురు గిరిజనులు స్పృహతప్పి పడిపోయారు. ఈ సంఘటన రేగళ్ల పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. అటవీ భూమిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పత్తి, సజ్జ పంటలకు అటవీ శాఖ అధికారులు యంత్రాలతో దున్నించారు. దీంతో పలువురు పోడుదారులు అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో గుగులోతు మంగీ, బానోతు విజయ, జర్పుల డాలీ, భూక్యా బోడ, తేజావత్ జమున స్పృహతప్పి పడిపోయారు. మంగీని 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. వైద్య సేవలు అందించారు. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ మంజుల, తీట్రౌన్ సీఐ బూర రాజ్‌గోపాల్, సీఐ శ్రీనివాసరావు, పాల్వంచ టౌన్ ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి, రూరల్ ఎస్సై బత్తుల సత్యనారాయణ ఎటువంటి గొడవలు జరగకుండా అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ రాజ్‌గోపాల్ మాట్లాడుతూ అటవీ భూముల్లో గిరిజనులు సాగు చేయడం సరికాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా కేసులు పెడతామని హెచ్చరించారు.