-
ఆస్తి పంపకాల్లో బంధువుల మధ్య వివాదమే కారణం?
-
డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
డక్కిలి :
ఆస్తి వ్యవహరంలో బంధువుల మధ్య ఏర్పడిన వివాదం ఓ వృద్ధుడి హత్యకు దారి తీసింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన మండలంలోని అల్తూరుపాడులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, డక్కిలి ఇన్‌చార్జి ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. మండలంలోని అల్తూరుపాడుకు చెందిన పాదిలేటి లక్ష్మణ్‌రెడ్డి(75), అతని బంధువు భారతమ్మ మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. బుధవారం ఉదయం లక్ష్మణ్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి, భారతమ్మ మధ్య పొలంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మణ్‌రెడ్డి బుధవారం రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు.
ఆస్తి వివాదమే హత్యకు కారణమా?
లక్ష్మణ్‌రెడ్డి హత్య వెనుక ఆస్తి వివాదమే కారణం అయి ఉంటుందని పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్‌రెడ్డి కుమారుడు ఆస్తి పంచుకుని చాలా ఏళ్ల క్రితమే గూడూరుకు కాపురం వెళ్లిపోయాడు. అయితే అల్తూరుపాడులో తన తండ్రి పేరున ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు 10 రోజుల నుంచి తన వద్దే ఉన్న తండ్రి లక్ష్మణ్‌రెడ్డితో కలిసి భూ సమస్యపై అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం గూడూరు నుంచి అల్తూరుపాడుకు చేరుకుని పొలాన్ని దున్నించేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఆస్తి తమ దేనని అతని బంధువు భారతమ్మ అడ్డు చెప్పడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో లక్ష్మణ్‌రెడ్డి బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు.
అయితే ఎవరు హత్య చేసి ఉంటారని పోలీసులు అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సంఘటన స్థలంలో కుమారుడు భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు బంధువులు, గ్రామస్తులను విచారించారు. లక్ష్మణ్‌రెడ్డిని ఎవరు హత్య చేశారనేది మిస్టరీగా మారింది.
హత్యా ఘటన ఛేదించేందుకు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. లక్కీ అనే జాగిలం సంఘటన స్థలంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలిచింది. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ సీఐ వెంకటగిరి ఇన్‌చార్జి శ్రీనివాసులురెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మణ్‌రెడ్డి కుమార్తె నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. లక్ష్మణ్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇన్‌చార్జి ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.