2న ‘అనంత’కు రాహుల్ గాంధీ
పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2వ తేదీన అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లిలో పర్యటించనున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించి ఫిబ్రవరి 2 నాటికి పదేళ్లు పూర్తవుతుంది. అప్పట్లో ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ దేశంలోనే మొట్టమొదటి సారిగా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు.
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నందున పేదలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ రానున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఇందిరభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వలసలు నివారించి, స్థానికంగా పనులు కల్పించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం నీరుగారకుండా పేదల్లో ధైర్యం నింపేందుకు భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతకుముందు రఘువీరారెడ్డి ఇందిర భవన్‌లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లంరాజు, జె.డి.శీలం, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, కొండ్రు మురళీ, ముజఫర్ అలీ తదితరులు పాల్గొన్నారు.