
ఓనం వేడుకలు ప్రారంభం
పుట్టపర్తి టౌన్ : కేరళీయులు పవిత్రంగా భావించే ఓనం పర్వదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది కేరళ భక్తులతోపాటు, దేశ విదేశాలకు చెందిన భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం కేరళ భక్తులు వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కేఎస్ శభరినాథన్ హాజరై ప్రసంగించారు. ప్రపంచ నలుమూలలా సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్య, తాగునీటి సేవలు వెలకట్టలేనివన్నారు.
అనంతరం కేరళకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు విట్టల్ వినోద్ భాగవతార్ బృందం సంగీత కచేరి నిర్వహించారు. కేరళ సంగీత రీతులలో చక్కటి స్వరాలోలికిస్తూ భాగవతార్ బృందం నిర్వహించిన సంగీత కచేరీతో భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లి దర్శించుకున్నారు.