ఎకరం కౌలు రూ.35,000
♦ కారంచేడులో చుక్కలనంటుతున్న కౌలు ధరలు
♦ రైతుల మధ్య నెలకొన్న పోటీయే కారణం
♦ చరిత్రలో ఇంత రేటు ఎప్పుడూ లేదంటున్న స్థానికులు
♦ గత ఏడాది సాగునీరు లేక బీళ్లుగా మారిన మాగాణిలు
♦ ఇప్పుడు అదే భూముల్లో మెట్ట పంటలపై ఆసక్తి
♦ మిర్చి సాగుకు మొగ్గుతున్న అన్నదాతలు
కారంచేడు : జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని పంట భూముల కౌలు ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటుతున్నాయి. రైతుల మధ్య నెలకొన్న పోటీ.. పెరిగిన అపరాలు, మిర్చి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కౌలు ధరలు ఎగసిపడటానికి కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం సాగుకు అనుకూలమైన వాతావరణం లేక, సాగుకు అవసరమైన నీరు విడుదల కాక ఈ ప్రాంతంలో ఏటా బంగారం పండే భూములు సైతం బీళ్లుగా మారాయి.
దీంతో ఈ ఏడాది మాగాణి భూములకు పేరొందిన కారంచేడులో అన్నదాతలు మెట్ట పంటల సాగుకు ఆసక్తి కన బర్చుతున్నారు. మిర్చికి లభించిన ధరల దృష్టా ఈ పంట సాగుకు పొలాలు సన్నద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మాగాణి సాగుకు భూములను కౌలుకు అడిగే నాధుడు లేడంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది మాగాణి సాగు నీరు లేక భూములను ఖాళీగా వదిలేసి తీవ్రంగా నష్టపోవడమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు.
పెద్ద రైతుల్లో ఆనందం..
గతంలో ఎన్నడూ లేని విధంగా అపరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో మెట్ట పైర్ల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది మాదిరిగా సాగుకు నీరు పెద్దగా లేకపోయినా మెట్ట పైర్లు సాగు చేసుకోవచ్చనే ధైర్యంతో రైతులు కౌలుకు ఎగబడుతున్నారు. దీంతో ధరలు కూడా రెట్టింపయ్యాయి. ఈ దశలో పెద్ద రైతులు కౌలు ఎక్కువగా వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తుంటే కౌలుదారులు మాత్రం కౌలు చెల్లింపునకు తోడు పెట్టుబడులు కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విపరీతంగా పెరిగేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడులు, ధరలపైనే ఆశలు..
పంటల దిగుబడులు, మంచి గిట్టుబాటు ధరలపైనే ఆశలు పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇంత ఎక్కువ ధరలకు భూములు కౌలుకు తీసుకొని లక్షలు ఖర్చుచేసి సాగు చేస్తే చేతికందివచ్చే దిగుబడులు, వాటికి ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధరలు ఎలా వుంటాయోనని ఇప్పటి నుండే ఆందోళన చెందుతున్నారు.
కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి
ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే సాగు భూములకు కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది మిరప సాగు చేసిన రైతులకు మంచి దిగుబడులతో పాటు గిట్టుబాటు ధరలు కూడా రావడంతో రైతులు లాభాలు ఆర్జించారు. శనగ రైతులకు కూడా మంచి లాభాలు వచ్చాయి. మాగాడి రైతులు మాత్రం నష్టపోయారు. - యార్లగడ్డ శ్రీనివాసరావు
ప్రకృతి పైనే ఆశలు..
ప్రస్తుతం అన్నదాతలు ప్రభుత్వం పై కాకుండ ప్రకృతి పైనే ఆశలు పెట్టుకొని వ్యవసాయానికి సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది సాగుకు చుక్క నీరు రాలేదు. ఈ ఏడాది కూడా సాగుకు నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రకృతి కరుణించి మంచి వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నాం. - దగ్గుబాటి నాగశ్రీనివాసరావు