మేకల సంతలో రూ. కోటిన్నరకు పైగా క్రయవిక్రయాలు
మేకల సంతలో రూ. కోటిన్నరకు పైగా క్రయవిక్రయాలు
Published Sat, Jul 23 2016 8:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
నవీపేట : ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన నవీపేట మండల కేంద్రంలోని మేకల సంతలో శనివారం రూ. కోటిన్నరకు పైగా క్రయవిక్రయాలు జరిగాయి. నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించే ఊర పండగ, వివిధ గ్రామాలలో వన భోజనాల నేపథ్యంలో ఒక్కసారిగా మేకల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో సరిహద్దు గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని జాల్నా, ముద్‌ఖేడ్, నాందేడ్, ధర్మాబాద్, పర్భణీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఒక రోజు ముందురాత్రి వాహనాలలో మేకలను తీసుకువచ్చి బేరసారాలు ప్రారంభించారు. వచ్చే నెలలో శ్రావణ మాసం ఉండడంతో ఇంట్లో జరిగే శుభకార్యాల (మాంసాహార విందు)ను ఈ వారంలో నిర్వహించనున్నారు. దూర ప్రాంతాలకు మేకలను తీసుకుని వెళ్లే వారు ఆటోట్రాలీ వాలాలు అడిగినంత ఇచ్చుకోకతప్పలేదు. సంత ఆవరణలో స్థలం సరిపోక బస్టాండ్, ప్రభుత్వ పాఠశాలల ముందు మేకలను తీసుకుని వచ్చిన వాహనాలను నిలిపారు. ఆలస్యంగా వచ్చిన వ్యాపారులు రోడ్లపైనే క్రయవిక్రయాలు జరిపారు.దీంతో బాసర రోడ్డుపై ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.
Advertisement
Advertisement