కూలి పనికెళ్లి.. కడతేరాడు
-
చెట్టుకొమ్మ విరిగిపడి యువకుడి మృతి
వెంకటగిరిరూరల్ : పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ యువకుడు చెట్టు కొమ్మ కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని సిద్ధవరం ఎస్టీ కాలనీకి చెందిన గడ్డం పెంచలయ్య, రాజమ్మ దంపతుల కుమారుడు గడ్డం శివ (19) కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. గురువారం బాలాయపల్లి మండలం నిడిగల్లుకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో చెట్లు నరికేందుకు ఆ గ్రామస్తులతో పాటు శివ కూడా కూలీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తున్న సమయంలో చెట్టుకొమ్మ విరిగి శివ తలపై పడింది. దీంతో శివ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించి సహచర కూలీలు శివను ఆటోలో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. రోజువారి కూలీ పనులు చేసుకునే తమకు వైద్యం ఖర్చులకు డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియక 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో శివ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకుంటే.. అకాలంగా మృతి చెందాడనే విషయం తెలిసిన శివ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శివ మృతితో సిద్ధవరం ఎస్టీకాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.