అమ్మో.. ఆన్‌లైన్
Published Sat, Dec 10 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
= బ్యాంకర్లకు మోదం..వినియోగదారులకు ఖేదం
= పాతబకాయిలకు జమవుతున్న క్యాష్ డిపాజిట్లు
= రైతులు, చేనేతల ఇబ్బందులు
ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సంతోష్‌కుమార్ అత్యవసర పని నిమిత్తం స్నేహితుణ్ని రూ.15 వేలు అప్పు అడిగాడు. అతను ఆన్‌లైన్ ద్వారా నగదును సంతోష్ అకౌంట్‌కు బదిలీ చేశాడు. నగదు తీసుకుందామని పట్టణంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లిన సంతోష్‌కు నిరాశే ఎదురైంది. ఈ మొత్తం మీరు తీసుకున్న లోన్‌కు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరిగి వచ్చేశాడు..
= ధర్మవరంలోని మాధవనగర్‌కు చెందిన శ్రీనివాసులు అనే చేనేత కార్మికుడు తాను నేసిన చీరను శిల్క్‌హౌస్‌లో విక్రయించాడు. దుకాణ యజమాని చీరకు చెల్లించాల్సిన మొత్తం రూ.12 వేలను శ్రీనివాసులు అకౌంట్‌కు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేశాడు. ఈ మొత్తాన్ని తీసుకుందామని కెనరా బ్యాంకుకు వెళ్లగా.. లోన్‌కు జయియందని చెప్పారు. ఇంకా రూ.20 వేలు చెల్లించేవరకు మీ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసుకునే వీలు లేదన్నారు. దీంతో చీర తయారీకి తెచ్చిన ముడిసరుకు అప్పు ఎలా తీర్చేది, కుటుంబ పోషణకు ఏం చేసేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ధర్మవరం మండలం రావులచెరువుకు చెందిన రామ్మోహన్‌రెడ్డి తన తోటలో పండిన టమాటాలను కర్ణాటకలోని కోలార్ మార్కెట్‌లో విక్రయించాడు. మండీ యజమాని రూ.8 వేలను ఆన్‌లైన్ ద్వారా రామ్మోహన్‌రెడ్డి అకౌంట్‌కు జమ చేశాడు. దీంతో ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. ‘మీరు బంగారు తాకట్టుపెట్టి అప్పుతీసుకున్నారు. బంగారాన్ని సకాలంలో విడిపించుకోలేదు. దీంతో వేలం వేశాం. వచ్చిన మొత్తంతో మీరు తీసుకున్న అప్పు పూర్తిగా తీరలేదు. బకాయి రూ.5వేలు ఉంద’ని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆ మొత్తం పోగా మిగిలిన రూ.3వేలు ఇచ్చి పంపారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక మీదట ఆన్‌లైన్ లావాదేవీలు చేయాలన్న మాట కూడా ప్రజల్ని మరింత కష్టాలపాలు చేస్తోంది. మరీముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవహారం చేనేత కార్మికులు, రైతులకు గుదిబండగా మారింది. వారు చేస్తున్న క్యాష్ డిపాజిట్లు గతంలో ఉన్న పాత బకాయిలకు జమ అవుతున్నారుు. ముఖ్యంగా రైతులు తాము తీసుకున్న క్రాప్, టర్మ్, సబ్సిడీ లోన్లు బ్యాంకులో తీసుకుని బకాయిలుంటే.. ఇప్పుడు తమ వద్దనున్న పెద్దనోట్లను డిపాజిట్ చేస్తే ఆ బకాయిలకు జమ అవుతున్నాయి. మొన్న ఖరీఫ్ సీజన్‌లో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడ్డ చాలా మంది రైతులు తమ పంట రుణాలను రెన్యూవల్ చేయలేదు. ఇటువంటి వారందరూ ఏదైనా పంట విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా తమ అకౌంట్లలోకి జమ చేయించుకుంటే.. వెంటనే పాత అప్పులకు వెళుతోంది. దీనివల్ల అత్యవసర కార్యమో..పంట సాగు చేయాలని తలపెట్టిన వారి పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి.
చేనేత కార్మికులది మరోసమస్య
ధర్మవరంలో చేనేత కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారు. వీరికి గతంలో మగ్గాలపై తీసుకున్న అప్పులు, సబ్సిడీ రుణాలకు సంబంధించిన బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చేనేత రుణమాఫీలో జాప్యం చేయడంతో రెండున్నరేళ్లకు సంబంధించిన వడ్డీ భారం పడింది. ప్రభుత్వ చేసిన రుణమాఫీ మొత్తం పోను.. వడ్డీ మొత్తం అలాగే బకాయిగా బ్యాంకుల్లో మిగిలి ఉంది. ప్రస్తుతం చేనేత కార్మికులు నగదు డిపాజిట్ చేసినా, పట్టు చీరలు విక్రరుుంచగా వచ్చిన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా జమ చేయిచుకున్నా.. మొత్తం ఆ బకాయిలకు జమవుతోంది. దీంతో చేనేత కార్మికులు పడరానిపాట్లు పడుతున్నారు. చేనేత, రైతులే కాదు.. వివిధ రంగాల కార్మికులు, పొదుపు సంఘాల సభ్యులు కూడా ఇదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. గతంలో బకాయిదారుల చుట్టూ తిరిగినా వసూలు కాని మొత్తాలు ఇప్పుడు తమ ప్రమేయం లేకుండానే వసూలు అవుతుండడంతో బ్యాంకర్లు లోలోన సంతోషపడుతున్నారు.
Advertisement
Advertisement