ప్రతిపక్షం ఖాళీ!
♦ గులాబీ గూటికి తెలుగు తమ్ముళ్లు
♦ బల్దియా విజయంతో సంచలనం
♦ ఒంటి చేత్తో జిల్లాను శాసిస్తున్న మహేందర్
♦ రెండేళ్ల ‘కారు’ ప్రయాణం
ఉద్యమమే ఊపిరిగా.. రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) జిల్లాలో బలీయశక్తిగా అవతరించింది. ప్రతిపక్షాలను ఉనికి కే పరిమితం చేసి.. గ్రేటర్‌లో అఖండ విజయంతో విమర్శకుల నోళ్లకు తాళం వేసింది. రెండేళ్ల క్రితం అస్థిత్వం కోసం పాకులాడిన టీఆర్‌ఎస్.. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తోంది.
సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు జిల్లాలో సమీకరణలు మారిపోయాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీ దాదాపుగా ఖాళీ అయింది. పచ్చపార్టీలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతా ఆరుగురు గూలాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఏకైక టీటీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా తాజాగా కారెక్కారు. కాంగ్రెస్ పార్టీది కూడా పరిస్థితి దాదాపుగా ఇంతే. ఆ పార్టీకి చెందిన ఇరువురి ఎమ్మెల్యేల లో కాలె యాదయ్య (చేవెళ్ల) ఏడాదిన్నర క్రితమే గులాబీ గూటికి చేరారు. ఇక మిగిలిన పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్‌రెడ్డి కూడా ఎప్పుడో ఒకసారి అధికారపార్టీ ఆకర్షణలో పడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి కంచుకోటకు బీటలు వారేలా చేయడం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కకావికలమయ్యాయి. గ్రేటర్‌లో విజయంతో కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైందనే అపవాదును చెరిపివేసింది. ఆరు నెలల క్రితం జరిగిన మండలి ఎన్నికల్లోనూ రెండు స్థానాలను గెలుచుకోగలిగింది. తగిన సంఖ్యాబలం లేకున్నా, విపక్షాలన్నీ కూటమిగా మారినా.. తమదైన శైలిలో పావులు కదిపి రెండు సీట్లను సునాయాసంగా కైవసం చేసుకుంది.
చక్రంతిప్పిన మహేందర్‌రెడ్డి
జిల్లాలో టీఆర్‌ఎస్ అజేయశక్తిగా మారడానికి ప్రధాన కారణం మంత్రి మహేందర్‌రెడ్డి అనేది నిర్వివాదాంశం. స్థానిక సంస్థల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు సరిపడా బలం ఉన్నా మహేందర్ ఎత్తుల ముందు ఆ పార్టీల పాచిక పారలేదు. జిల్లా పరిషత్‌లోనూ ఇదే తరహా పావులను కదిపి విజయం సాధించిన టీఆర్‌ఎస్.. జిల్లాలో వ్యూహాత్మకంగా ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసింది. ప్రతిపక్షాల్లోని అనైక్యతను సొమ్ము చేసుకోవడం.. స్వపక్షంలోని అసమ్మతిని రాజీ చేసుకోవడం ద్వారా జిల్లా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు. ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మహేందర్.. పార్టీ నిర్ణయాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. పార్టీ పదవులు మొదలు.. నామినేటెడ్ పదవుల పంపకం వరకు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయి.
ఇక తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరిన తెలుగు తమ్ముళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పద వుల వడ్డనలో తమ ప్రాధాన్యం తగ్గకుండా.. నిధుల కేటాయింపుల్లో వివక్ష లేకుండా పనులు కానిచ్చేసుకుంటున్నారు. అధికారపార్టీలో నివురు గప్పిన నిప్పులా అసమ్మతి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అసంతృప్తిని బయటకు వెళ్లగక్కే సాహసం నేతలు చేయడంలేదు. పాత, కొత్త నేతల మధ్య అంతర ం కొనసాగుతునే ఉంది. నామినేటెడ్ పదవుల వ్యవహారంలోనూ వైరివర్గాల నడుమ లుకలుకలు సాగుతునే ఉన్నాయి. ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు అక్కడక్కడా ఉన్నా.. కారు దూకుడు మాత్రం తగ్గడంలేదు.