గజ్వేల్... ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్‌టాపిక్...అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం కీలకం కానుంది. ఇక్కడ నుంచి తెలంగాణ ఉద్యమ సారథి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పోటీ చేస్తున్నారు. సాధారణంగా గజ్వేల్‌లో ఏ పార్టీ విజయం సాధిస్తే... ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీ. గడిచిన 13 ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. గజ్వేల్ నుంచి టీఆర్‌ఎస్ తొలిసారి 2014లో పోటీ చేసింది. పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్రసారథిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్, కొత్త రాష్ట్రం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్‌ను అక్కడి ప్రజలు గెలిపించారు. అయితే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పెద్దగా లేకపోయినా...గడిచిన నాలుగున్నరేళ్లలో వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు.
ఈ అంశం ఆధారంగానే ఆయన గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నారు. ఇక్కడ భారీ మెజారిటీ తెప్పించే బాధ్యతను మాత్రం తన మేనల్లుడు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఇటీవల సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో 15 వేల మంది పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భారీస్థాయిలో కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకావడమేకాక...ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనను గెలిపించే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు కూడా ఆయన నియోజకవర్గానికి చెందిన ప్రజలతో మమేకం అయ్యారు. 2014కు పూర్వం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్ లేదు. కేసీఆర్ బరిలోకి దిగిన తర్వాతే ఇక్కడ పార్టీ పటిష్టానికి బీజం పడింది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అభివృద్ధి పరుగులు...
గజ్వేల్‌ను తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్న కేసీఆర్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే భారీ ఎత్తున అభివృద్ధికి బాటలు వేశారు. ప్రధానంగా ఇక్కడ రూ. 1600 కోట్లతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ చేపట్టారు. మిషన్ భగీరథ పథకం తొలిసారిగా ఇక్కడే పనులు పూర్తి చేసి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. గజ్వేల్‌కు రైల్వేలైన్ కలను సాకారం చేయడానికి కూడా కేసీఆర్ చొరవ చూపారు. జనవరి కల్లా గజ్వేల్‌కు రైలు కూత వినిపించనుంది. మొత్తానికి నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే...
గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయంగా ఆగర్భశతృవులుగా ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డిలు ఒక్కటి కావడం ఇక్కడి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. 2009 నుంచే వీరికి రాజకీయ వైరం ఉంది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డిపై నర్సారెడ్డి 7 వేల ఓట్ల మెజార్టీ గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన నర్సారెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతాప్‌రెడ్డి వర్గాన్ని నిర్యీర్యం చేయడానికి వీలైనంతగా ప్రయత్నించారు. 2014లోనూ వీరిద్దరూ కేసీఆర్‌పై పోటీ చేశారు. ఆ సందర్భంలో తాను ఓడిపోయినా సరే...ప్రతాప్‌రెడ్డి గెలువకూడదనే పంతంతో టీఆర్‌ఎస్‌కు నర్సారెడ్డి పరోక్షంగా సహకరించారనే ప్రచారం జరిగింది. కీలకమైన ఎన్నికల సమయంలో భిన్నధృవాలుగా ఉన్న వీరు ఒక్కటికావడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
సిట్టింగ్ ప్రొఫైల్
కె.చంద్రశేఖరరావు 1983కి ముందు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరారు. కాంగ్రెస్ నేత అనంతుల మదన్ మోహన్‌పై మొదటిసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1985 నుంచి 1999 వరకు ఓటమి లేకుండా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభా డిప్యూటీ స్పీకర్‌గా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2001 ఏప్రిల్ 27న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)ని స్థాపించారు. 2004 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి రెండుచోట్లా గెలుపొందారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఆరు నెలల పోర్ట్‌ఫోలియో లేనిమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేశారు. 2006లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి మరోసారి కరీంనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008లో కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్ధానం పోటీచేసి విజయం సాధించారు. 2014లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ప్రత్యేకతలు..
- రూ. 153 కోట్లతో కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ హబ్
- ఆధునిక వెజిటబుల్ మార్కెట్
- రూ. 1200 కోట్లతో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాల
- రూ.435 కోట్లతో మిషన్ భగీరథ పథకం
- దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలలో 600 డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం
- రూ.220 కోట్లతో రింగురోడ్డు, రూ.100 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ మోడల్ కాలనీ
ప్రధాన సమస్యలు
- నిరుద్యోగం ప్రధాన సమస్య. నియోజకవర్గంలో సుమారు 15 వేల మందికి పైగా చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
- నియోజకవర్గంలో భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం ఎదురుచూపులు.
– కె.శ్రీకాంత్‌రావు
Comments
Please login to add a commentAdd a comment