కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి...
-
జగన్ సమక్షంలో పలువురిచేరిక
దివాన్‌చెరువు (రాజానగరం) :
మండలంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు నాయకులు వారి అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించడంతో ఆ పార్టీల ద్వారా వచ్చిన పదవులను త్యజించి గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దేశాల శ్రీను, ఎస్సీ సెల్ కార్యదర్శి కుంచే వీర్రాజు, నాయకులు కోలపాటి పండు, సప్పిడి బూరయ్య పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా సేవలందించిన శ్రీను రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ సరైన రీతిలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లలనే నేడు ప్రత్యేక హోదా విషయంలో కూడా మోసపోయామన్నారు. ఈ తరుణంలో ఇంకా ఆ పార్టీలో ఉండటం సరి కాదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాగా కొత్తతుంగపాడు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కోలపాటి సుబ్బారావు తన అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి విశేష సేవలందిస్తూ వస్తూ మండల స్థాయిలో కూడా పలు పార్టీ పదవులు నిర్వహించారు. ప్రస్తుతం పార్టీలో పనిచేసే వారికి సరైన గుర్తింపు లేదని, గ్రామంలో నిరంకుశ ధోరణిలో షాడో సర్పంచ్ పాలన చేస్తున్నా పెద్దలు పట్టించుకోవడం లేదని సుబ్బారావు అన్నారు. పార్టీకి ఆవిర్భావం నుంచి విశేషంగా సేవలందిన తన తండ్రి సూర్యారావు హఠాన్మరణం పొందితే పార్టీ వారెవరూ రాకపోవడం కూడా మనస్తాపాన్ని కలిగించిందన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ కోలపాటి వెంకన్న, స్థానిక నాయకుడు కోలపాటి విష్ణుల ద్వారా వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. రెండు పార్టీల నుంచి వచ్చిన వారికి జగన్ వైఎస్సార్‌సీపీ పార్టీ కండువాలు మెడలో వేసి స్వాగతం పలికారు. మండల కన్వీనర్ మందారపు వీర్రాజు, అడబాల చినబాబు పాల్గొన్నారు.