భారీగా పైరసీ సీడీల పట్టివేత
భారీగా పైరసీ సీడీల పట్టివేత
Published Mon, Dec 19 2016 10:24 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
గుంటూరు (పట్నంబజారు) : నిబంధనలకు విరుద్ధంగా నూతన , నీలిచిత్రాలు విక్రయిస్తున్న సీడీ షాపులపై ఏక కాలంలో దాడులు చేసి గుంటూరు అర్బన్ పోలీసులు భారీగా సీడీలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 టీంలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి పర్యవేక్షణలో సోమవారం రాత్రి దాడులు చేశారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. వివరాలను ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి మీడియాకు వెల్లడించారు. పాతగుంటూరు, పట్టాభిపురం, అరండల్‌పేట, కొత్తపేట పోలీసుస్టేషన్‌ల పరిధిలో క్విక్ రియాక్షన్ టీంతో కలిసి దాడులు చేసినట్లు తెలిపారు. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని నెహ్రునగర్‌లో సీడీల తయారీ కేంద్రాన్ని గుర్తించటం జరిగిందన్నారు. వాటిలో 8 క్యాబినెట్‌లు ఒక్కొక క్యాబినెట్ 10 డీవీడీ ట్రేలను కలిగి ఉన్నాయని, 2000 సీడీ కవర్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని డాల్ఫిన్ మ్యూజికల్ షాపులో 600 సినిమాలు కలిగి ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో 400 కొత్త చిత్రాల సీడీలు, 3 కంప్యూటర్లు, పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలో సీతానగర్‌లో 1వలైనులో ఉన్న బాబు వీడియో షాపు నందు ములుపూరి మోహన్‌బాబు అనే నిర్వాహకుడి నుంచి 123 అశ్లీల, 76 కొత్త చిత్రాల సీడీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని తుళ్లూరి శ్రీధర్ నుంచి 33 కొత్త సినిమాలు, 82 అశ్లీల చిత్రాల సీడీలను పట్టుకున్నారు. పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో కూడా 76 నూతన, 123 అశ్లీల చిత్రాలను స్వాధీనం చే సుకున్నట్లు వివరించారు. వీరిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వీరికి మాస్టర్ కాపీ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు సాయం అందిస్తున్నారనే కోణాల్లో విచారిస్తున్నామన్నారు. ధృవ, మన్నెంపులితో అనేక కొత్త సినిమాల సీడీలను 524, అశ్లీల చిత్రాల సీడీలను 254 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement