ఆగడాల నేత.. అంతులేని మేత
⇒ పామర్రు నియోజకవర్గంలో శృతిమించిన చోటా నేత ఆగడాలు
⇒ అడ్డు చెబితే పోలీస్ కేసులు
⇒ ప్రభుత్వ కార్యాలయం నుంచే దందాలు
⇒ అక్రమాలకు సహకరించలేదని పంచాయతీ కార్యదర్శి బదిలీ
ప్రస్తుతం అక్రమ సంపాదనకు అర్హత ఏంటంటే అధికార పార్టీలో నేత కావటమే అని ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. స్థాయి ఏదైనా చాలూ అధికారం ముసుగేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. బహిరంగంగానే దందాలు చేస్తూ పేదోళ్ల జాగాలపై గద్దల్లా వాలిపోతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వసూళ్లు.. అభివృద్ధి పనుల్లో వాటాలు.. భూముల కబ్జాలతో వెలిగిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టిస్తూ బరితెగిస్తున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : తూర్పు కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో అధికార పార్టీ చోటా నేతలు అక్రమ సంపాదనకు అడ్డదారులు తొక్కుతున్నారు. వారి ఆగడాలకు ప్రభుత్వ యంత్రాంగం వంత పాడుతుండడంతో చెలరేగిపోతున్నారు. ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త అధికార దర్పంతో చేస్తున్న అవినీతి చిట్టా విప్పితే ఔరా అనకమానరు.
► తెనాలికి చెందిన ఓ వ్యక్తికి మండల స్థాయి ప్రజాప్రతినిధికి చెందిన స్వగ్రామంలో 1.50 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఈ నేత కౌలు పేరుతో కజ్జా చేశాడు. ఖాళీ చేయమంటే, భూ యజమాని భూమి కోసం నేతల చుట్టూ తిరుగుతున్నాడు
► సీఆర్‌డీఏ పరిధిలో ఉండే ఆ గ్రామంలో గ్రీన్ డివైట్ లేఅవుట్ వేస్తే ఆ యజమానులను బెదిరించి ఈ నేత తన తండ్రి పేరుతో 0.12 ఎకరాల రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్న ఆరోపణలున్నాయి.
► అదే గ్రామంలో అనుమతి లేని లేఅవుట్ వేసినందుకు నజరానాగా రూ.10 లక్షలు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి.
► విజయవాడ–మచిలీపట్నం రహదారి నిర్మాణంలో చోటా నేతకు సంబంధించిన పది సెంట్ల భూమిపోతే పక్కనే ఉన్న విజయవాడకు చెందిన డాక్టర్‌కు సంబంధించిన మరో మూడు సెంట్లు భూమిని కలుపుకొని ప్రభుత్వ పరిహారం తన భార్య అయిన ప్రజాప్రతినిధి పేరుతో తీసుకున్నాడు. సదరు డాక్టర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ మూడు సెంట్లకు నగదును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాడు.
► చోటా నేత స్వగ్రామంలో తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు పాత విగ్రహాన్ని కొనుగోలు చేసి తన ప్రత్యర్థి దొడ్డిలో దాచి అతనిపై కేసులు నమోదు చేయించి జైలుకు పంపాడు. అయితే చివరకు కేసు ఫాల్స్ కేసుగా వీగిపోయింది.
► పామర్రులో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆయన మేనత్త తన నివాసం రాసిస్తూ వీలునామా రాసింది. అదే ఇంటికి నకిలీ రికార్డులు సృష్టించి ఆ ఇల్లు తమదే అంటూ అతని ఇంటిపైకి అర్ధరాత్రి వెళ్లి దాడి చేసి మహిళను లాగి బయటపడేశారు. పోలీస్ స్టేషన్‌లో రివర్స్ కేసు వారిపై పెట్టించారు. ఈ దాడిలో మండల పార్టీ నేతతో పాటు బినామీ డీలర్ కీలకంగా వ్యవహరించాడు.
► మండల స్థాయి నేత ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లు అతని భార్య మేనత్తది. ఆ ఇంటిని కజ్జా చేసేందుకు ఆ ఇంటి పన్ను తన భార్య అయిన ప్రజాప్రతినిధి పేరుతో కట్టించుకోవాలని పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. కుదరదని చెప్పడంతో కార్యదర్శిని బదిలీ చేయించి మరో కార్యదర్శిని వేయించుకొని అతని ద్వారా ఇంటి పన్ను కట్టించాడు. యజమాని ఇంటి కోసం పోరాడుతోంది.
► మండల పరిషత్ ద్వారా ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తానని తన అనుచరులతో భారీగా వసూళ్లు చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి.
► అర్ధరాత్రి వరకు మండల ప్రజాప్రతినిధికి కేటాయించిన కార్యాలయంలో తిష్ట వేసి దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా అధికారం ముసుగేసుకొని చోట నేతలు ప్రజలను బాధపెడుతున్నారు.
► మండల స్థాయి ప్రజాప్రతినిధి స్వగ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని ఆ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను బహిరంగంగా కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. చివరకు ఆ అమాయకులపైనే హత్యాయత్నం కేసులు పెట్టించాడు.
► కనుమూరు గ్రామానికి చెందిన ఎస్సీ రాష్ట్ర నాయకుడు గ్రామాభివృద్ధి కోసం రూరల్ డెవలప్‌మెంట్ (ఆర్‌డీఎఫ్) స్కీమ్ ద్వారా రూ.80 లక్షలు నిధులు కేటాయిస్తే ఆ పనులు చేసే కాంట్రాక్టర్‌ను బెదిరించి 5 శాతం కమీషన్ పుచ్చుకున్నాడు.