మిరుదొడ్డి: రాష్ట్ర అవతరణ అనంతరం తొలిసారిగా విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఐకేపీ మహిళా సమాఖ్య గ్రూపులను తరలించడానికి చర్యలు చేపట్టినట్లు పీడీ సత్యనారాయణ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఐకేపీ ఏసీలకు, ఏపీఎంలకు , సీసీలకు, మహిళా గ్రూపు వీవో లీడర్లకు మహిళల తరలింపుపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలో 5120 మహిళా గ్రూపులు ఉన్నాయన్నారు. జిల్లా నుండి మోదీ సభకు తరలించడానికి సుమారు 4000 బస్సులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రతి బస్సు ఆయా గ్రామాలకు 7న ఉదయం 6 గంటలకే చేరుకుంటుందని తెలిపారు. ఒక్కో బస్సుకు 50 మందిని కేటాయించి, ఒక వీకో లీడర్‌ను, ఒక క్లస్టర్ కోఆర్డినేటర్‌ను నియమిస్తామన్నారు.
బస్సులో తరలివెళ్లేవారికి ఆహారం, మంచి నీరు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు తరలి వెళ్లే మహిళలు వ్యక్తిగతంగా ఎలాంటి వస్తువులు వెంట తెచ్చుకోకుండా చేసుకోవాలని తెలిపారు. సభకు వెళ్లే ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఆర్టీసీ బస్సులు మినహాయించి ప్రైవేటు వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.
సభకు వెళ్లిన ప్రతి మహిళా గ్రూపును సభ అనంతరం క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చే వరకు ఐకేపీ ఏపీఎంలు, సీసీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ మదుసూధన్, ఐకేపీ ఏపీఎం కృష్ణారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మినర్సమ్మ, వివిధ మండలాలకు చెందిన ఏపీఎంలు, ఏరియా కో ఆర్డినేటర్లు, సీసీలు మహిళా సంఘాల వీవో లీడర్లు తదితరులు పాల్గొన్నారు.