ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ఆకివీడు : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన పెదకాపవరం గ్రామ శివారు గొల్లగూడెంకు చెందిన చింతల జగదీష్(45) ఉప్పుటేరులో శుక్రవారం శవమై తేలాడు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. వివాహేతర సంబంధం కారణంగా అతడిని చంపి మూటకట్టి ఉప్పుటేరులో పడేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆకివీడు ఎస్సై రఘు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలిదిండి మండలం తాడినాడ శివారు సున్నంపూడి సమీపంలో ఉప్పుటేరులో గోనె సంచిలో మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆకివీడు పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వచ్చి గోనెసంచిలో ఉన్న మృతదేహాన్ని చింతల జగదీష్ (45)గా గుర్తించారు. ఈ నెల 4న జగదీష్ కనిపించకపోవడంతో అతని కుమారుడు చింతల శివకృష్ణ ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి జగదీష్ బంధువులు గాలిస్తున్నారు. ఉప్పుటేరులో వెతుకుతున్న క్రమంలో శుక్రవారం గోనెసంచిలో శవం ఉన్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రణాళిక ప్రకారం హత్య
జగదీష్ మృతికి వివాహేతర సంబంధం కారణమనే కోణంలో పోలీసులు విచారించారు. దీంతో కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన పాలెం వెంకటలక్షి్మతో జగదీష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇటీవల జగదీష్ తమ సంబంధాన్ని అందరికీ చెబుతానని వెంకటలక్షి్మని బెదిరిస్తున్నాడు. దీంతో వెంకటలక్ష్మి తన భర్త ఏడుకొండలు స్నేహితుడైన బాలాజీకి జగదీష్ బెదిరిస్తున్న విషయం చెప్పింది. అతడు ఏడుకొండలకు జరిగిన విషయం తెలిపాడు. దీంతో ఏడుకొండలు, బాలాజీ, వెంకటలక్ష్మి కలిసి జగదీష్‌ను చంపాలని నిర్ణయించారు. జగదీష్‌ను ఇంటికి రమ్మని వెంకటలక్షి్మతో పిలిపించారు. ఇంటికి వచ్చిన జగదీష్‌ను తుండు అతడి మెడకు చుట్టి పీకనొక్కి చంపివేశారని ఎస్సై రఘు తెలిపారు. అనంతరం శవాన్ని గోనెసంచిలో మూటకట్టి ఉప్పుటేరులో పడేశారని చెప్పారు. శవాన్ని పోస్టుమార్టానికి పంపి కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు రఘు తెలిపారు. విచారణలో ఏఎస్సై, రైటర్ తదితరులు పాల్గొన్నారు.