సెప్టెంబర్ 30లోపు ఆదాయ పన్ను చెల్లించాలి
గ్రీన్, క్లాత్, గోల్డ్ మర్చంట్ వర్తకులకు అవగాహన సదస్సు
వికారాబాద్ రూరల్: సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆదాయపు పన్ను చెల్లించని వారు చెల్లించి, ఆదాయ వెల్లడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ సర్కిల్ ఆదాయపు పన్ను అధికారి వి.కల్యాణ్‌కుమార్, ఇన్స్‌పెక్టర్ పి.శ్రీనివాస్ సూచించారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఆదాయపు పన్ను వికారాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో పట్టణంలోని గ్రీన్, క్లాత్, గోల్డ్ మర్చంట్ సభ్యులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ.. 2015-16 లేదా అంతకుముందు సంవత్సరాల్లో ఆస్తులుగానీ ఇతర రూపేణా ఆదాయం వెల్లడించని వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఆస్తి రూపంలో వెల్లడించే పక్షంలో 2016 జూన్ ఒకటో తేదీనాటికి ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువను ఆదాయంగా పరిగణిస్తారన్నారు. డిక్లరేషన్లు ఆన్లైన్‌లోగానీ, ప్రింట్ ఫారంలో సంబంధిత ప్రిన్సిపల్ కమిషనర్ వద్ద దాఖలు చేసుకోవచ్చన్నారు.
2016 జూన్ ఒకటో తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఈ పథకం అమలులో ఉంటుందన్నారు. పన్ను, సర్‌చార్జి పెనాల్టీ మొత్తం కలిపి వెల్లడి చేసిన ఆదాయంలో 45% చెల్లించాలన్నారు. అందుకు ఆఖరి తేదీ 2016 నవంబర్ 30 వరకు ఉంటుందన్నారు. ఈ పధకంలో వెల్లడి చేసిన ఆస్తులపై తదుపరి విచారణ ఉండదన్నారు. వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఈ పథకాన్ని వినియోగించుకుని టాక్స్ ఉల్లంఘన నుంచి బయట పడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సూపరిటెండెంట్ పురుషోత్తంరావు, గ్రీన్, క్లాత్, గోల్డ్ మర్చంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.