సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ కార్యాలయం
తేలని లెక్కలు
Published Fri, Aug 19 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
రూ. 10.06కోట్లకు గల్లంతైన లెక్కలు
నిధుల వినియోగంపై అనుమానాలు
రాజీవ్ విద్యా మిషన్ పీఓకు సోకాజ్ నోటీసు జారీ
వివరణ ఇచ్చేందుకు నేడే ఆఖరి రోజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆ శాఖలో నిధులు దండిగా ఉంటాయి. ఏ అవసరానికైనా వాటిపైనే ఆధారపడతారు. ఒక్కోసారి అధికారుల ఒత్తిడితో ఇతర శాఖలకూ నిధులు మళ్లిస్తారు. ఇదే ఇప్పుడు కొంపముంచింది. దాదాపు రూ. పదికోట్లకు లెక్కలు కనిపించట్లేదు. నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగ పత్రాలు సమర్పించలేదు. తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు జిల్లా అధికారికి షోకాజ్ నోటీసు జారి చేశారు. శనివారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
నిధులు దండిగా ఉండే విభాగాల్లో సర్వశిక్ష అభియాన్‌దే అగ్రస్థానం. 2014–15, 2015–16లో జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను విద్యాభివద్ధికి, పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, ఉపా«ధ్యాయుల వేతనాలు, పాఠశాలల నిర్వహణ కోసం ఖర్చు పెట్టాలి. వాటికి ఖర్చు చేశాక సంబంధిత నిధుల మేరకు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించాలి. కానీ, జిల్లాలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. రెండేళ్ల కాలంలో రూ. 10.06కోట్లకు అధికారులు లెక్కలు చూపించలేకపోయారు. సరికదా వాటికి సంబంధించి రికార్డులూ లేవు.
నిధులకోసం ఆ శాఖపైనే ఆధారం
వాస్తవానికి సర్వశిక్షా అభియాన్ నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయి. నిధులున్న శాఖగా గుర్తింపు పొందడంతో ఉన్నతాధికారుల దష్టి అంతా దానిపైనే ఉంటుంది. జిల్లా ఉన్నతాధికారులకు ఏ అవసరం వచ్చినా, జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం తలపెట్టినా ఎస్‌ఎస్‌ఏ నిధులపైనే గురి పెడతారు. ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసి నిధులు సమకూర్చాలని ఒత్తిళ్లు చేస్తారు. ఉన్నతాధికారుల మాట వినకపోతే ఇబ్బందని నిధులను అప్పనంగా ఇస్తారు. ముఖ్యమంత్రి పర్యటనలకు, మంత్రుల సమావేశాలకు, అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు ఈ నిధులనే వెచ్చిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల్ని ఇతర శాఖలకు అవసరమొస్తే మళ్లిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అడ్వాన్సుల పేరిట వాడుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చే నిధులు కూడా దుర్వినియోగమవుతున్నాయి. రెండేళ్లుగా పాఠశాల నిర్వహణ కమిటీల్లేకపోవడంతో ఎంఈఓలే ఆ పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఎక్కడేం ఖర్చు పెట్టారో ఎవరికీ తెలియలేదు. బహుశా రూ. 10.06కోట్లకు లెక్కలు తేలకపోవడానికి ఇవే కారణాలు కావచ్చని తెలుస్తోంది.
పీఓకు సోకాజ్ నోటీసు జారీ
కారణమేదైతేనేమి ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో రూ. 10.06కోట్లకు లెక్కల్లేవని, మరో రూ. 23.77కోట్లు ఖర్చు పెట్టకుండా బ్యాంకుల్లో ఉన్నాయని గుర్తించారు. వీటికి గల కారణాలేంటో, ఎక్కడున్నాయో కచ్చితంగా చెప్పలేకపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 12న పీఓకు సోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎందుకు చర్యలు తీసుకోకూడదో 20వ తేదీలోగా వివరణివ్వాలని నోటీసులో ఆదేశించారు.
ఎంఈఓలకు హడావుడిగా నోటీసులు
స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి సోకాజ్ నోటీసు రావడమే తరువాయి ఇక్కడ సర్వశిక్షా అభియాన్ అధికారులు అప్రమత్తమయ్యారు. లెక్కలు తేల్చే పనిలో నిమిగ్నమయ్యారు. ముందుగా ఎంఈఓలకు నోటీసులు జారీ చేశారు. మండలాల వారీగా విడుదల చేసిన నిధులకు లెక్కలు చూపాలని, యూసీలివ్వాలని కోరినట్టు తెలిసింది.
Advertisement
Advertisement