- బతికుండగానే ‘చచ్చిపోయాడట!’
- భార్య పేరుతో వితంతు పింఛన్
- జన్మభూమి సభ్యుడి కక్కుర్తి
- ఇదేమి చోద్యమంటున్న జనం
పదవిలో పదిలం పింఛన్ కోసం మరణం
Published Sat, Oct 8 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
కాకినాడ :
‘ఫ్రీగా వస్తే ఫినాయిలైనా’ తాగేస్తాడన్న సామెతను అక్షరాలా నిజం చేశాడో జన్మభూమి కమిటీ సభ్యుడు. రూ.వెయ్యి పింఛన్ సొమ్ము కోసం బతికుండి కూడా చనిపోయినట్టుగా అధికారులను తప్పుతోవ పట్టించి భార్య పేరుతో వితంతు పింఛన్ మంజూరు చేయించుకున్నాడు. జన్మభూమి కమిటీ సభ్యునిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని పింఛన్ పొందిన సదరు వ్యక్తి వ్యవహారం బయటపడడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... కాకినాడ సూర్య నారాయణపురానికి చెందిన మేడిశెట్టి అప్పలరాజు 32వ డివిజన్ జన్మభూమి కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నాడు. పింఛన్ల మంజూరు, పంపిణీలో పెత్తనం చలాయిస్తున్న సదరు అప్పలరాజు పనిలోపనిగా తన కుటుంబంలో ఓ పింఛన్ మంజూరు చేయించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన భార్య మేడిశెట్టి సత్యవతి పేరిట వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేయించాడు. జన్మభూమి కమిటీ సభ్యునిగా ఇతని సిఫార్సుకు కార్పొరేషన్ సిబ్బంది కూడా తలాడించడంతో ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లలో అతని భార్య సత్యవతి పేరిట (ఐడి నెంబర్ 104807376) పింఛన్ కూడా వచ్చేసింది. ఈ నెల 2వ తేదీన 32వ డివిజన్‌కు సంబంధించిన శెట్టిబలిజ రామాలయం వద్ద పింఛన్ల పంపిణీ కేంద్రంలో ఆమె రూ.వెయ్యి పింఛన్ కూడా తీసుకుంది. కొత్త పింఛన్ కావడంతో ఈమె ఎవరా? అని ఆరా తీస్తే జన్మభూమి కమిటీ సభ్యుని భార్య అని తేలింది. ఎంతో మంది అర్హులైన వితంతువుల పింఛన్ కోసం ఎదురుచూస్తుండగా వారందరినీ పక్కన పెట్టి ఈమెకు పింఛన్ మంజూరు చేయడంపై స్థానికులు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జన్మభూమి కమిటీ సభ్యునిగా ఉంటూనే తన భార్యపేరుతో ఎలా పింఛన్ తీసుకుంటాడని స్థానకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే డివిజన్‌కు చెందిన మరో వ్యక్తి కూడా బతికుండగానే ఏడాది నుంచి వితంతు పింఛన్ పొందుతున్నట్టు ఆరోపణలున్నాయి. అతను కూడా జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి అప్పలరాజుకు సన్నిహితంగా మెలిగే వ్యక్తేనని స్థానికులు చెబుతున్నారు.
ఎలా మంజూరైంది?
వితంతు పింఛన్ మంజూరు కావాలంటే తప్పనిసరిగా భర్త మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్, రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది.
అవన్నీ సక్రమంగా ఉంటేనే పింఛన్ కోసం సిఫార్సు చేసి మంజూరు చేస్తారు. బతికున్న మేడిశెట్టి సత్యవతి భర్త అప్పలరాజు పేరిట డెత్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది?. నకిలీ సర్టిఫికెట్ జత చేశారా? ఇవేమీ లేకుండా సిఫార్సు చేశారా? అన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మంజూరు చేసిన విధానంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు
విచారణ చేసి చర్యలు...
జన్మభూమి కమిటీ సభ్యుని భార్య వితంతు పింఛన్ పొందుతున్నారనే అంశం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– ఎస్. అలీమ్ భాషా, కమిషనర్, కాకినాడ నగరపాలక సంస్థ
Advertisement