టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
చాగలమర్రి: రాయలసీమను దగా చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని చాగలమర్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమలో వర్షాల్లేక ప్రజలు అల్లాడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటే తప్ప దిగువకు నీరు విడుదల చేయరాదనే నిబంధనను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారను. వచ్చే అరకొర నీటిని కూడా స్వార్థంతో కోస్తాకు తరలించడం సీమ ప్రజలను మోసగించడమేనన్నారు. పాలకుల మాటకు తలొగ్గి నీళ్లు విడుదల చేస్తూ ఇంజనీరింగ్ అధికారులు కూడా తప్పు చేస్తున్నారని.. వీరిపై న్యాయస్థానానికి వెళ్లే హక్కు సీమ ప్రజలకు ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలుగుతోనే సీమకు మేలు చేకూరుతుందన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.