కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షవాతం రోగులు
విస్తరిస్తున్న పక్షవాతం
Published Mon, Sep 26 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
నెలకు 200 మంది వరకు వ్యాధి బారిన పడుతున్న వైనం
వర్షాకాలంలోనే అధికమవుతున్న కేసులు
ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రస్తుతం పక్షవాతం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నెలకు 200 వరకూ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోతే... ప్రాణాలకే ప్రమాదమని వైదనిపుణులు చెబుతున్నారు. వ్యాధి వచ్చిన తరువాత కూడా నిర్లక్ష్యం కూడదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో పక్షవాతం(పెరాలసిస్) వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. గతంలో కంటే ఈ ఏడాది పక్షవాతం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం జిల్లాకేంద్రాస్పత్రిలో 20 మంది వరకు పక్షవాతంకోసం చికిత్స పొందుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే పక్షవాతం బారిన పడుతున్నారు. ఇది పెద్దవారితో పాటు, పిల్లల్లో కూడ వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
పక్షవాతం రావడానికి ఇవే కారణాలు
పెద్దవారిలో అయితే వయస్సు రీత్యా, గుండె జబ్బులు ఉన్న వారికి, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న వారికి, అతిగా మద్యం సేవించిన వారికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. పిల్లలయితే పుట్టుకతోను, ఇనఫెక్షన్ వల్ల, గాయాలై ఎముకల్లో నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో సరిగా నడవకపోవడం. అడుగులు పడకపోవడం. మూత్రం ఎక్కువగా రావడం, తక్కవగా రావడం, చూపు మందగించడం. పట్టు తప్పడంవంటివి వ్యాధి లక్షణాలని చెబుతున్నారు. దీనినుంచి రక్షణ పొందేందుకు పిల్లలకు రెగ్యులర్‌గా తనిఖీ చేయించాలి. పరిసర ప్రాంతాలను, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమతుల్యమైన పౌస్టికాహారాన్ని పిల్లలకు పెట్టాలి.
ఇక పెద్దవారిలో అయితే...
తలనొప్పిగా, నీరసంగా ఉండడం, చేత్తో ఏమీ పట్టుకోలేక పోవడం. కాలకత్యాలకు వెళ్లేటప్పుడు పడిపోవడం, మతిమరుపు వంటివి వస్తే పక్షవాతం లక్షణాలుగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా తనిఖీలు చేయించుకోవడం, 40ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్, కంటి వైద్య పరిక్షలు చేయించుకోవాలనీ, మద్యం సేవించకూడదని చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనీ, పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలనీ, వేసవిలో వడగాడ్పులు తగలకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు– బోళెం పద్మావతి, జనరల్ ఫిజీషియన్, జిల్లాకేంద్రాస్పత్రి
గతంలో కంటే పక్షవాతం రోగుల సంఖ్య పెరిగింది. గతంలో నెలకు 50 నుంచి 60మంది ఈ వ్యాధి బారిన పడగా ప్రస్తుతం 200 మంది వరకు వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో 50, 60 ఏళ్లు దాటినవారే ఈ వ్యాధి బారిన పడగా ఇప్పుడు 40 ఏళ్లు దాటిన వారు కూడా వ్యాధి బారిన పడుతున్నారు. చిన్న పిల్లలకు సంబంధించి నెలకు 10 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే 40 ఏళ్లు దాటిన వారు ఏటా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి ఉన్నట్టయితే వైద్యుని సలహా మేరకు మందులు క్రమం తప్పకుండా వాడాలి. ముఖ్యంగా వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరగడం, మద్యం సేవించడం చేయకూడదు. బీపీ, షుగర్ వ్యాధి పరీక్షలు చేయించుకోకపోతే ఆకస్మాత్తుగా అవికాస్తా పెరిగి పక్షవాతం బారిన పడే ప్రమాదం ఉంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. వేసవిలో ఓఆర్‌ఎస్ ద్రావణం, మజ్జిగ సేవించాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. పొలం పనిచేసేవాళ్లు బట్టలు లేకుండా పనిచేయకూడదని పేర్కొంటున్నారు.. ఉదయం 11 గంటలు లోపు పనులు ముగించేయాలి.
Advertisement
Advertisement