కంచిలి : కంచిలి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో పుణ్యస్త్రీ గెడ్డ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు గాయాల పాలయ్యారు. పోలీసులు చెప్పిన వివరాలు... పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీని అదే మార్గంలో వెనుక నుంచి ఓవర్‌టేక్ చేస్తున్న మహింద్ర మ్యాక్స్ పిక్‌అప్ వాహనం బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ వాహనాలు వెనుక వేగంగా వస్తున్న మహీంద్ర బొలేరో వాహనం డ్రైవర్ ప్రమాద దృశ్యాన్ని చూసి హఠాత్తుగా బ్రేకు వేశాడు.
దీంతో ఆ వాహనం కూడా డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మ్యాక్స్ పిక్ అప్ వాహనం వెనుక భాగం తొట్టెలో ప్రయాణిస్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం నొయిటా గ్రామానికి చెందిన సుబోధ్ వాహనంలో నుంచి ఎగిరిపడి రోడ్డు మీద పడి దుర్మరణం పాలయ్యాడు. అతనితో ఉన్న సహచరుడు ఆర్.మండల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వాహనం వెనుక వస్తూ బోల్తా పడిన మహీంద్రా బొలేరో వాహనంలో ఉన్న కంచిలి మండలం పోలేరు గ్రామానికి చెందిన లింగం సత్యారావుకు కూడా కుడి చెయ్యి విరిగింది. ప్రమాద సమాచారం తెలుసుకొన్న కంచిలి, సోంపేట పోలీసులు, ఎన్‌హెచ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందించారు.
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పశ్చిమబెంగాల్ నుంచి ఏలూరుకు చేపల లోడ్‌ను తీసుకెళ్లి అన్‌లోడ్ చేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం, గాయపడిన వారికి చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోంపేట సీఐ సూరినాయుడు, సోంపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు, కంచిలి ఎఎస్‌ఐ రామక్రిష్ణ సంఘటనా వివరాలు తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఏఎస్‌ఐ వీబీ రామక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Published Wed, Jun 15 2016 11:41 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM
Advertisement
Advertisement