పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ రసాభాస
-
అంచనాకు మించి వచ్చిన అభ్యర్థులు
-
సౌకర్యాలు కల్పించని జేఎన్‌టీయూకే అధికారులు
-
ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు
-
నినాదాలతో దద్దరిల్లిన వర్సిటీ ప్రాంగణం
-
అపస్మారక స్థితిలోకి విద్యార్థిని
బాలాజీచెరువు (కాకినాడ) :
జేఎన్‌టీయూకేలో శనివారం నిర్వహించిన పీజీ ఈసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రసాభాసగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ–కాకినాడ, అనంతపురంలలో మాత్రమే కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో, కాకినాడ కేంద్రానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు వచ్చారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. రెండో దశలో 200 మందికి మించి హాజరు కారనే ఉద్దేశంతో పెద్దగా ఏర్పాట్లు చేయలేదు. కానీ, ఊహించని రీతిలో 825 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఇందుకు తగినట్టుగా సిబ్బందిని నియమించకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలు దాటేసరికి కనీసం 300 మందికి కూడా వెరిఫికేషన్ చేయలేకపోయారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కపక్క ఎండ, మరోపక్క తాగడానికి మంచినీరు కూడా లేని దుస్థితిని ఎదుర్కొన్నారు. వర్సిటీ క్యాంటిన్‌లో భోజన సౌకర్యం కూడా లేకపోవడంతో ఆకలితో మాడిపోయారు. వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుందో తెలియకపోవడంతో ఒక్కసారిగా వారు ఆగ్రహానికి గురై వెరిఫికేషన్ సిబ్బందితో పాటు, సెక్యూరిటీ అధికారుల పైకి కూడా దూసుకువచ్చారు. దీంతో ఆ ప్రాంగణమంతా నినాదాలతో గందరగోళంగా మారింది. 30 మందికి కూడా మించి పట్టని చిన్న గదిలో వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడం.. దాదాపు వంద మందికి పైగా ఒకేసారి ఆ గదిలోకి గుంపుగా ప్రవేశించడంతో గాలి ఆడక గుంటూరు చెందిన విద్యార్థిని ప్రసన్న అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. ఆమెను స్థానికుడైన ఈదల మూర్తి తన వాహనంలో ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అదుపు చేయడం ఒక దశలో కష్టతరమైంది. చివరకు సర్పవరం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
నేటి సాయంత్రం వరకూ గడువు పెంచాం
రెండో దశ పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌కు ఆదివారం సాయంత్రం వరకూ గడువు పెంచాం. అర్ధరాత్రయినా సరే నిరంతరాయంగా ప్రతి విద్యార్థి సర్టిఫికెట్లూ వెరిఫై చేస్తాం. వెరిఫికేషన్‌తోపాటు ఆప్షన్ల మార్పు గడువును సోమవారం సాయంత్రం వరకూ పెంచాం.
– డాక్టర్ జీఈఆర్ ప్రసాదరాజు, పీజీ ఈసెట్ కన్వీనర్
మంచినీటి సౌకర్యం కూడా లేదు
ఒకపక్క వేసవి తరహాలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం కుర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో చెట్లకిందే ఉండాల్సి వచ్చింది. – మహేష్, కాకినాడ
అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు
వర్సిటీ అ«ధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వెరిఫికేషన్ ప్రక్రియకు ఒక్క రోజు మాత్రమే సమయమివ్వడం, సాయంత్రం 5 గంటలు దాటినా కనీసం 200 కూడా పూర్తి కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మధ్యాహ్నం నుంచైనా కౌంటర్లు పెంచి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఉండాల్సింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంవల్లే ఈ సమస్య ఏర్పడింది. – పూజిత, విజయవాడ
కేంద్రాలు పెంచాలి
కౌన్సెలింగ్‌కు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఏ సమయానికి పూర్తవుతుందో తెలీదు. కనీసం మంచినీటితోపాటు ఉండడానికి వసతి సౌకర్యం కల్పిం చినా సరిపోయేది. క్యాంపస్ క్యాంటిన్‌లో సరైన భోజన వసతి లేకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జేఎన్‌టీయూకేలో కనీ సం 800 మంది విద్యార్థులు ధ్రువపత్రాలు పరిశీలన చేయలేని పరిస్థితి ఉందంటే ఇక్కడి అధికారులు ఏవిధంగా ఉన్నారో అర్థమవుతుంది.
– యామిని, విజయవాడ