ఫార్మసిస్టుల పాత్ర కీలకం
విజయవాడ (లబ్బీపేట): సమాజంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ తెలగరెడ్డి సత్యానందం అన్నారు. పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులోని కేవీఎస్సార్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పరిశోధనలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షులు, కళాశాల కన్వీనర్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇన్సులిన్ ఆవిష్కరణను వివరించారు. నవంబరు మూడో వారంలో జరిగే ఫార్మసీ వారోత్సవాలలో ఈ ఏడాది మధుమేహం నివారణపై అవగాహన పెంపొందించేలా జరుపుకుంటున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గరికిపాటి దేవలరావు ఫార్మసీ వారోత్సవాల విశిష్టతను వివరించారు. సిద్ధార్థ అకాడమీ సభ్యులు పేర్ల భీమారావు, యలమంచిలి రామమోహనరావు, పీజీ విభాగ డైరెక్టర్ డాక్టర్ బుచ్చినాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ఫార్మడి, బి ఫార్మసీ విద్యార్థులు ఏర్పాటు చేసిన పోస్టర్స్ ప్రదర్శనను సత్యానందం ప్రారంభించారు. మధుమేహ రోగులు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు, కాయగూరలు, పండ్ల ప్రదర్శనను బి ఫార్మశీ విద్యార్థులు ఏర్పాటు చేశారు.
ఫొటో 20 విఐఇ 42– ఫార్మసీ వారోత్సవాలను ప్రారంభిస్తున్న సత్యానందం, ప్రిన్సిపాల్ దేవలరావు