Income Tax Commissioner
-
ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్
ఆదాయపుపన్ను కట్టనివారిపై సంబంధిత శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. ‘360డిగ్రీ ప్రొఫైలింగ్’ ద్వారా అపరకుబేరులు కట్టే పన్ను ఎగవేతను అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. గడిచిన బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక పన్ను రేటును 42.74 నుంచి 39 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల(హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్) పన్ను ఎగవేతను అరికట్టలేకపోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తూ ఎగవేతకు పాల్పడుతున్న కోటీశ్వరులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రూ.1కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న లేదా అందుకు అవకాశం ఉన్న వ్యక్తులను '360-డిగ్రీల ప్రొఫైలింగ్' చేయనున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా వ్యక్తుల పెట్టుబడి ప్రొఫైల్, ఖర్చులు, అసెస్మెంట్ కోసం ఆదాయ వనరులను ట్రాక్ చేస్తోందని వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 61 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌ల్లో రూ.ఒక కోటి కంటే ఎక్కువ ట్యాక్సబుల్ ఆదాయాన్ని చూపించారు. అయితే ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఐటీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించిన వారికి నోటీసులు పంపనున్నట్లు సమాచారం. -
మహిళ డాక్టర్‌పై ఐటీ కమిషనర్ లైంగిక దాడి.. బెదిరింపులు
ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్‌పై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి మహిళ గర్భం దాల్చి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరికి చెందిన 33 ఏళ్ల మహిళ నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. నేషనల్ అకాడమీ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్‌లో శిక్షణ కోసం 2019లో నాగ్‌పూర్ వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. తాను యూపీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో వైద్యురాలికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చి మహిళతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడి.. మహిళ అశ్లీల ఫోటోలను తీసుకొని భద్రంగా దాచుకున్నాడు. ఇటీవల ఆ మహిళ గర్భవతి అవ్వడంతో నిందితుడు ఆమెకు అబార్షన్ చేయించాడు. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమె అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని నిందితుడు బెదిరించాడు. తనను మోసం చేశాడని సదరు మహిళ నాగ్‌పూర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 (2) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు బెంగళూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. విచారణ కొనసాగుతుందన్నారు. -
‘ముందస్తు’ ఆదాయం
సాక్షి, వరంగల్ రూరల్: మునిసిపాలిటీల్లో ఇంటి యజమానులు ముందస్తుగా పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని పురపాలక శాఖ ప్రకటించింది. ఈ గడువు గత నెల 30వ తేదీతో ముగి సింది. ఈ మేరకు శాఖ విడుదల చేసిన ప్రకటనకు గృహయ జమానులు పలువురు ముందుకొచ్చా రు. ఉమ్మడి జిల్లాలోని యజమానులు రూ.15 కోట్ల మేర పన్నులు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లు కాగా.. యజమానులకు సైతం రాయితీ కింద రూ.75లక్షల మేరకు కలిసొచ్చింది. విస్తృత ప్రచారం రాష్ట్రంలో అన్ని పురపాలికల్లో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా పన్నులు చెల్లిస్తే పురపాలక శాఖ ఐదు శాతం రాయితీని ప్రకటించింది. పురపాలికలకు ఆదాయం పెరుగుతుందని ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఏప్రిల్ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. దీనికి ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకొచ్చేలా అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. మునిసిపాలిటీల పరిధిలో ప్లెక్సీలు కట్టించడంతో పాటు జీపులు, ఆటోల ద్వారా ప్ర త్యేకంగా ప్రచారం నిర్వహిం చారు. బిల్ కలెక్టర్లు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ పన్ను ల వసూలుకు ప్రయత్నించారు. ముఖ్యంగా పెం డింగ్ బకాయిలు ఉన్న వారి నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసేలా ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఇచ్చారు. అయినా అంతంతే... రాయితీ ద్వారా అయినా పన్నులు త్వరగా చెల్లిస్తారనే ఉద్దేశంతో పథకం ప్రవేశపెట్టినా అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 1,12,194 గృహాలు ఉంటే 25,894 గృహాల వారు మాత్రమే స్పందించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 36శాతం గృహాల వారు ప్రభుత్వ రాయితీకి స్పందించి పన్నులు చెల్లించారు. మిగతా మున్సి పాలిటీల్లో అంతంత మాత్రంగానే చెల్లించారు. అత్యల్పంగా మరిపెడ మున్సిపాలిటీలో కే వలం తొమ్మిది మంది మాత్రమే స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1,68,922 గృహాలకు గాను 32,164 గృహాల వారు రూ.15,00,95,000 చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రాయితీ ద్వారా యజమానులకు రూ.75,04,750 మేర కలిసొచ్చింది. నూతన మునిసిపాలిటీల్లో స్పందన కరువు గ్రామపంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన పట్టణాల్లో ఇంటి పన్నుదారుల నుంచి స్పందన కరువైంది. వర్దన్నపేట, డోర్నకల్, మర్రిపెడ, తొర్రూరు గ్రామపంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో డీసీ తండాను విలీనం చేశారు. దీనిని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఇంటి పన్నులు చెల్లించేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితే మిగతా చోట్ల కనిపించింది. రాయితీపై ప్రచారం నిర్వహించాం ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఉంటుందనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. పన్ను చెల్లింపుదారుల్లో ప్రతీ ఇంటి తలుపుతట్టి సమాచారాన్ని అందించాం. మరో మూడు నెలలు గడిస్తే అదనంగా పన్నుపై 2 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని వివరించాం. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా ముం దస్తుగా ప్రజలు స్పందించి ఆస్తి పన్ను చెల్లించారు. – రవి కిరణ్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ -
ఫార్మసిస్టుల పాత్ర కీలకం
విజయవాడ (లబ్బీపేట): సమాజంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ తెలగరెడ్డి సత్యానందం అన్నారు. పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులోని కేవీఎస్సార్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పరిశోధనలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షులు, కళాశాల కన్వీనర్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇన్సులిన్ ఆవిష్కరణను వివరించారు. నవంబరు మూడో వారంలో జరిగే ఫార్మసీ వారోత్సవాలలో ఈ ఏడాది మధుమేహం నివారణపై అవగాహన పెంపొందించేలా జరుపుకుంటున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గరికిపాటి దేవలరావు ఫార్మసీ వారోత్సవాల విశిష్టతను వివరించారు. సిద్ధార్థ అకాడమీ సభ్యులు పేర్ల భీమారావు, యలమంచిలి రామమోహనరావు, పీజీ విభాగ డైరెక్టర్ డాక్టర్ బుచ్చినాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ఫార్మడి, బి ఫార్మసీ విద్యార్థులు ఏర్పాటు చేసిన పోస్టర్స్ ప్రదర్శనను సత్యానందం ప్రారంభించారు. మధుమేహ రోగులు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు, కాయగూరలు, పండ్ల ప్రదర్శనను బి ఫార్మశీ విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఫొటో 20 విఐఇ 42– ఫార్మసీ వారోత్సవాలను ప్రారంభిస్తున్న సత్యానందం, ప్రిన్సిపాల్ దేవలరావు -
అవినీతిపై అందరూ పోరాడాలి
విజయవాడ : అవినీతికి వ్యతిరేకంగా బందరురోడ్డులో శనివారం కస్టమ్స్, ఇన్‌కంటాక్స్ ఉద్యోగులు ‘వాక్‌దన్’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు సందర్భంగా కస్టమ్స్, ఇన్‌కంటాక్స్ ఉద్యోగులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్ అజిత్‌కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అవినీతిపై ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్ ఎస్పీ చౌదరి మాట్లాడుతూ అవినీతి వల్ల అభివృద్ధి కుంటుపడుతుంన్నారు. ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ ధర్మమార్గం క్షేమకరం, శుభకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌కంటాక్స్ ఉన్నతాధికారులు ఏకే శ్రీవాత్సవ, ఎస్పీ చౌదరి, సుశీల్ కుమార్ జాజూ, కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్, ఇంటెలిజెన్స్ బ్యూరో చంద్రశేఖర్, జాయింట్ పోలీసు కమిషనర్ హరకుమార్కు నిర్వాహక కమిటీ ప్రతినిధులు జ్ఞాపికలు అందజేశారు. ఇన్‌కంటాక్స్ అడిషినల్ కమిషనర్ బి.శ్రీనివాస్, జాయింట్ కమిషనర్లు టీవీపీ లత, శేషశ్రీనివాస్, సత్యానందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
మాట వినకుంటే..
- ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ మోసగాడి హెచ్చరికలు - తెలంగాణ, ఏపీలోనూ బెదిరింపు కాల్స్ - ఐఆర్ఎస్నంటూ టెండర్లు పొందిన వైనం - కైకలూరులో పోలీసులకు చిక్కిన కేటుగాడు కైకలూరు: ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్, ఐఆర్ఎస్ అంటూ ప్రజలను భయపెట్టి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులకు గురువారం చిక్కాడు. తెలంగాణ, ఏపీలో ఇతగాడి మాయమాట లకు పలు శాఖలు ప్రొటోకాల్ సైతం కల్పించాయి. కైకలూరు మండలం ఆలపాడులో ఓ చేపల చెరువు వివాదంలో దంపతులను బెదిరించిన ఘటనలో పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కైకలూరులో సీఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో నిందుతుడి వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ గ్రామానికి చెందిన పిడకల సురేష్ కుమార్ ఎంబీఏ చదివి 2008 వరకు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తర్వాత కేలాబ్ అనే పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను సరఫరా చేసే సంస్థను నెలకొల్పాడు. హైదరాబాదులోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్సు మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు తాను ఐఆర్ఎస్, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునంటూ టెండర్లు దక్కించుకున్నాడు. నకిలీ ఐడెంటిటీ కార్డుపై ఆఫీస్ అడ్రస్ రేస్‌కోర్టు రోడ్డు, కొయంబత్తూరు అని... ఇంటి అడ్రస్ ఎలిగేషన్ రోడ్డు, భరత్‌నగర్ కాలనీ, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద, కొయంబత్తూరు అంటూ ముద్రిం చుకున్నాడు. మధ్య మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇన్‌కంట్యాక్స్ కార్యాలయానికి వచ్చి... తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ హుందాగా మాట్లాడడంతో అతను వచ్చినప్పుడల్లా పోలీసులు, రె వెన్యూ అధికారులు ప్రొటోకాల్ పాటించారు. తెలంగాణలో ఎక్కువగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా చిక్కాడు... కైకలూరు మండలం ఆలపాడు వద్ద నంగెడ్డ శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి 2 ఎకరాల 70 సెంట్లను ఇదే గ్రామానికి చెందిన పెనుమూడి నాగ వెంకట లక్ష్మీనారాయణ దంపతులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో చేపల చె రువు ఉంది. శ్రీకాంత్ తిరిగి తన భూమి తనకు అమ్మాలని కోరుతున్నాడు. దీనికి ఆ దంపతులు ఒప్పుకోలేదు. చివరకు శ్రీకాంత్ ఘరానా మోసగాడు సురేష్‌కుమార్‌ను ఆశ్రయించాడు. ఇతను లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునని, మీ ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించాడు. ఈ విషయాన్ని దం పతులు గుడివాడ డీఎస్పీ వై.అంకినీడు ప్రసాద్‌కు తెలుపగా ఆయన ఆదేశాలతో రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్ వలపన్ని నకిలీ ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 420, 170 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
రాత్రంతా సాగిన ఐటీ దాడులు
పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలో గురువారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంకు చెందిన ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఆర్.కె.సింగ్, నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో జరిగిన దాడులు వేకువజాము మూడున్నర గంటలవరకు కొనసాగాయి. పట్టణంలోని డా.యాళ్ల వివేక్, డా.యాళ్ల పద్మజలకు చెందిన జయశ్రీ ఆస్పత్రితోపాటు, యిండుపూరు బ్రదర్స్ గుంపస్వామి, గున్నేష్, ప్రభాకర్, శ్రీనివాసరావు, గోపాలరావులకు చెందిన విజయలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, యిండుపూరు జ్యూయలర్స్, శ్రీ మహాలక్ష్మీ జ్యూయల్ ప్యాలెస్, మహాలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్ తదితర బంగారం షాపుల్లో ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కనీసం ఎవర్నీ కదలనీయకుండా చేపట్టిన ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడులతో పట్టణంలోని పన్ను ఎగవేతదారుల గుండెల్లో రైళ్లు పరుగులెడుతున్నాయి. అంతే కాకుండా శుక్రవారం కూడా మళ్లీ ఐటీ దాడులున్నాయన్న ప్రచారంతో పట్టణంలో దాదాపు పెద్ద పెద్ద వ్యాపార దుకాణాలు తెరచుకోలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఇన్‌కం ట్యాక్స్ రేంజ్-1 అధికారి రామునాయుడు జయశ్రీ ఆస్పత్రికొచ్చి డాక్టర్ యాళ్ల వివేక్‌తో గంటల కొలది చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా శుక్రవారం కూడా జయశ్రీ ఆస్పత్రిలో దాడులు కొనసాగాయనే ప్రచారం జోరందుకుంది. అంతే కాకుండా వేరే బంగారం షాపు దాడిలో పాల్గొన్న ఆ అధికారి వచ్చి నేరుగా డాక్టర్‌తో గంటలు తరబడి చర్చలు జరపడం రెండోరోజు కూడా తనిఖీలు జరుగినట్టు చర్చించుకున్నారు. ఈ విషయమై ఆ అధికారి వద్ద విలేకరులు ప్రస్తావించగా.. తమ ఉన్నతాధికారులు మాట్లాడతారన్నారు. ఈ విషయమై డాక్టర్ వివేక్ వద్ద ప్రస్తావించగా.. సాధారణ తనిఖీలే అని చెప్పారు. ఐటీ అధికారి రామునాయుడు పార్వతీపురం ప్రాంతం అల్లుడు కావడంతో.. వైద్యం కోసం వచ్చారని, కావాలంటే ఆతని చేతిలో కళ్ల మందు చూడాలని చెప్పారు. -
బంగారం షాపులపై ‘ఇన్‌కం ట్యాక్స్’ దాడులు
పార్వతీపురం: పార్వతీపురంలోని వ్యాపారుల గుండెల్లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు రైళ్లు పరుగెత్తించారు. గురువారం పట్టణంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ విశాఖపట్నానికి చెందిన ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఆర్.కె.సింగ్, నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. వ్యాపార సంస్థలతో పాటు ఆస్పత్రిపై కూడా దాడులు చేశారు. . యిండుపూరు బ్రదర్సే టార్గెట్‌గా...! ఇన్‌కం ట్యాక్స్ అధికారులు గురువారం చేపట్టిన దాడులు యిండుపూరు బ్రదర్సే టార్గెట్‌గా జరిగినట్లు చర్చ జరుగుతోంది. పార్వతీపురం పట్టణంలో దాదాపు 40 వరకు బంగారం దుకాణాలున్నాయి. వీటిలో యిండుపూరు బ్రదర్స్‌తో సమానంగా, ఎక్కువగా వ్యాపారం చేసే వారూ ఉన్నారు. అయితే యిండుపూరు బ్రదర్స్ గుంపస్వామి, గున్నేష్, ప్రభాకర్, శ్రీనివాసరావు, గోపాలరావులకు చెందిన విజయలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, యిండుపూరు జ్యూయలర్స్, శ్రీ మహాలక్ష్మీ జ్యూయల్ ప్యాలెస్, మహాలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్ తదితర బంగారం షాపుల్లోనే దాడులు జరిగాయి. ఆరు బృందాలుగా... సరిగా ఉదయం 11.30 గంటల సమయంలో ఆరు బృందాలుగా ఏర్పడిన అధికారులు దాడులు నిర్వహించారు, ఒక్కో బృందంలో ఏడుగురు చొప్పున సభ్యులున్నారు. ఏక కాలంలో షాపులు, పట్టణంలో పేరొందిన డాక్టర్ యాళ్ల వివేక్, డాక్టర్ యాళ్ల పద్మజలకు చెందిన జయశ్రీ ఆస్పత్రిపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లో బంగారం నిల్వలు, క్యాష్, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం. బెంబేలెత్తిన వ్యాపారులు: ఇన్‌కం ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారన్న విషయం దావానలంలా వ్యాపించింది. దీంతో పార్వతీపురం పట్టణంలోని బంగారం వ్యాపారులతోపాటు మిగతా వర్తకులు బెంబేలెత్తిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే తమ షాపులు మూసివేశారు. భారీగా నగదు, ఆస్తుల గుర్తింపు...: దాడులు నిర్వహించిన ఇన్‌కం ట్యాక్స్ అధికారులు లెక్కల్లో లేని క్యాష్, ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. దీనిలో భాగంగా ఓ బంగారం షాపులో మూడు బస్తాలకు పైగా క్యాష్ గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవర్నీ అనుమతించని అధికారులు... ఇదిలా ఉండగా దాడులు చేపట్టిన క్షణం నుంచి అధికారులు షాపుల్లో పనివాళ్లను సైతం బయటికి పంపించలేదు. అలాగని లోపలికి ఎవర్నీ అనుమతించలేదు. కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. దీనిపై సమాధానం చెప్పేందుకు అధికారులు ముందుకురాలేదు. ఈ దాడులు శుక్రవారం కూడా జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. బొబ్బిలిలో ఐటీ దాడులు బొబ్బిలి: బొబ్బిలిలో ఆదాయపు పన్ను అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ దాడులు సాగాయి. పట్టణంలోని మెయిన్ బజారులో ఉన్న మూడు బంగారం దుకాణాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీనివాస జ్యూయలర్స్, శ్రీకాంత్ జ్యూయలర్స్, సుధా జూయలర్స్ల్లో అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంటు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో దాదాపు 30 మంది అధికారులు ఈ తనిఖీలు చేశారు. రాత్రి పది గంటల వరకూ ఈ దాడులు సాగాయి. బంగారం అమ్మకాలు, రికార్డులు, నిల్వలు వంటివి పరిశీలించారు. అలాగే ఓ విద్యాసంస్థలో కూడా తనిఖీలు నిర్వహించారు. రాత్రంతా ఈ తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని ఐటీ అధికారులు తెలిపారు.