బంగారం షాపులపై ‘ఇన్‌కం ట్యాక్స్’ దాడులు | income tax raid in PARVATHIPURAM | Sakshi
Sakshi News home page

బంగారం షాపులపై ‘ఇన్‌కం ట్యాక్స్’ దాడులు

Published Fri, Jun 5 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

income tax raid in PARVATHIPURAM

 పార్వతీపురం: పార్వతీపురంలోని వ్యాపారుల గుండెల్లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు రైళ్లు పరుగెత్తించారు. గురువారం పట్టణంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విశాఖపట్నానికి   చెందిన ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఆర్.కె.సింగ్, నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఈ   దాడులు జరిగాయి. వ్యాపార సంస్థలతో పాటు  ఆస్పత్రిపై కూడా దాడులు చేశారు. .
 
 యిండుపూరు బ్రదర్సే టార్గెట్‌గా...!
 ఇన్‌కం ట్యాక్స్ అధికారులు గురువారం చేపట్టిన దాడులు యిండుపూరు బ్రదర్సే టార్గెట్‌గా జరిగినట్లు చర్చ జరుగుతోంది. పార్వతీపురం పట్టణంలో దాదాపు 40 వరకు బంగారం దుకాణాలున్నాయి. వీటిలో యిండుపూరు బ్రదర్స్‌తో సమానంగా, ఎక్కువగా వ్యాపారం చేసే వారూ ఉన్నారు.   అయితే యిండుపూరు బ్రదర్స్ గుంపస్వామి, గున్నేష్, ప్రభాకర్, శ్రీనివాసరావు, గోపాలరావులకు చెందిన విజయలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, యిండుపూరు జ్యూయలర్స్, శ్రీ మహాలక్ష్మీ జ్యూయల్ ప్యాలెస్, మహాలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్ తదితర బంగారం షాపుల్లోనే దాడులు జరిగాయి.
 
 ఆరు బృందాలుగా...
 సరిగా   ఉదయం 11.30 గంటల సమయంలో ఆరు బృందాలుగా ఏర్పడిన అధికారులు దాడులు నిర్వహించారు, ఒక్కో బృందంలో ఏడుగురు చొప్పున సభ్యులున్నారు. ఏక కాలంలో  షాపులు, పట్టణంలో పేరొందిన డాక్టర్ యాళ్ల వివేక్, డాక్టర్ యాళ్ల పద్మజలకు చెందిన జయశ్రీ ఆస్పత్రిపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లో బంగారం నిల్వలు, క్యాష్, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం.  
 
 బెంబేలెత్తిన వ్యాపారులు: ఇన్‌కం ట్యాక్స్ అధికారులు  దాడులు నిర్వహించారన్న విషయం  దావానలంలా వ్యాపించింది. దీంతో పార్వతీపురం పట్టణంలోని   బంగారం వ్యాపారులతోపాటు మిగతా వర్తకులు బెంబేలెత్తిపోయారు.  సమాచారం తెలిసిన వెంటనే  తమ షాపులు మూసివేశారు. భారీగా నగదు, ఆస్తుల గుర్తింపు...: దాడులు  నిర్వహించిన ఇన్‌కం ట్యాక్స్ అధికారులు లెక్కల్లో లేని   క్యాష్, ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. దీనిలో భాగంగా ఓ బంగారం షాపులో మూడు బస్తాలకు పైగా క్యాష్ గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 ఎవర్నీ అనుమతించని అధికారులు...
 ఇదిలా ఉండగా దాడులు చేపట్టిన క్షణం నుంచి అధికారులు షాపుల్లో  పనివాళ్లను సైతం బయటికి పంపించలేదు. అలాగని లోపలికి ఎవర్నీ అనుమతించలేదు. కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. దీనిపై సమాధానం చెప్పేందుకు అధికారులు ముందుకురాలేదు. ఈ దాడులు   శుక్రవారం కూడా జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.
 
 బొబ్బిలిలో ఐటీ దాడులు
 బొబ్బిలి: బొబ్బిలిలో ఆదాయపు పన్ను అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ దాడులు సాగాయి. పట్టణంలోని మెయిన్ బజారులో ఉన్న మూడు బంగారం దుకాణాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీనివాస జ్యూయలర్స్, శ్రీకాంత్ జ్యూయలర్స్, సుధా జూయలర్స్‌ల్లో అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంటు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో దాదాపు 30 మంది అధికారులు ఈ తనిఖీలు చేశారు. రాత్రి పది గంటల వరకూ ఈ దాడులు సాగాయి. బంగారం అమ్మకాలు, రికార్డులు, నిల్వలు వంటివి పరిశీలించారు. అలాగే ఓ విద్యాసంస్థలో కూడా తనిఖీలు నిర్వహించారు. రాత్రంతా ఈ తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని ఐటీ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement