కారు.. పోరు! | physical attacks of TRS cadres in Membership Registration | Sakshi
Sakshi News home page

కారు.. పోరు!

Published Mon, Mar 20 2017 11:19 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కారు.. పోరు! - Sakshi

కారు.. పోరు!

గులాబీలో ఆధిపత్య పంచాయితీ
సభ్యత్వ నమోదులో రచ్చకెక్కుతున్న విభేదాలు
పాత, కొత్త నేతల మధ్య అంతరం
మహేశ్వరంలో భౌతికదాడులకు దిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీలో ఆధిపత్య పోరు మొదలైంది. పాత, కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య, సఖ్యతతో పార్టీ పరువు రచ్చకెక్కుతోంది. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం అసమ్మతి రాజకీయాలకు వేదికగా మారింది. మొన్న జిల్లా పరిషత్‌ మొదలు.. నిన్న ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమన్ గల్‌లో బయటపడిన విభేదాలు తాజాగా మహేశ్వరంలో వైరివర్గాల భౌతికదాడులతో తారస్థాయికి చేరాయి. సంస్థాగతంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో సుదీర్ఘ విరామం అనంతరం అధికారపార్టీ సభ్యత్వ నమోదు పేరిట ప్రజల్లోకి వెళుతోంది.

ఇదే అదనుగా ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి కాస్తా ఒక్కసారి పెల్లుబికుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత, కొత్త నేతల మధ్య స్పష్టమైన విభజనరేఖ వచ్చింది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపించింది. దీనికితోడు ఇటీవల నామినేటెడ్‌ పదవుల పంపకంలోనూ కొత్తవారికే ప్రాధాన్యం ఇస్తుండడం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి కోపం తెప్పిస్తోంది. ఉద్యమకాలంలో వెన్నంటి నిలిచినవారిని కాదని ఎన్నికలఅనంతరం పార్టీ తీర్థం పుచ్చుకున్నవారి మాట చెల్లుబాటు అవుతుండడం.. ఆఖరికి సభ్యత్వ నమోదు పుస్తకాలను ఎమ్మెల్యేలకే ఇస్తుండడం పార్టీని అంటిపెట్టుకున్న పాతతరం నాయకులకు మింగుడు పడడంలేదు. ఈ పరిణామాలు అధికారపార్టీలో ముసలానికి దారితీస్తున్నాయి.

మొన్న జిల్లా పరిషత్‌లో జెడ్పీటీసీ సభ్యులు ఏకంగా మంత్రి మహేందర్‌రెడ్డిపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. రాజీనామాస్త్రాలు సంధించడం ద్వారా అధిష్టానానికి హెచ్చరికలు జారీచేశారు. నయానో భయానో వారిని బుజ్జగించి దారిలో పెట్టినప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధానికి అద్దంపడుతున్నాయి.

లుకలుకలకు కారణం ఇదే!
2014 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచినవారిని పార్టీలో చేర్చుకోవడంతో గులాబీలో అసమ్మతి రాజకీయాలకు బీజం పడింది. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు ‘కారె’క్కడంతో పార్టీలో విభేదాలకు కారణమైంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. ఎల్‌బీనగర్, షాద్‌నగర్‌లోనూ అంతర్గతపోరు ఉన్నప్పటికీ, బహిర్గతం కాకపోవడంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు కాస్తా సజావుగానే సాగుతున్నాయని అనుకోవచ్చు.

పట్నంలో రెండు శిబిరాలు!
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధం వీధికెక్కింది. మూడు గ్రూపులు.. ఆరు కీచులాటలతో పార్టీ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన కంచర్ల శేఖర్‌రెడ్డితో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. దీనికితోడు ఈసీ శేఖర్‌గౌడ్, ఎంపీపీ నిరంజన్ రెడ్డి తదితరులు కూడా మంచిరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శేఖర్‌రెడ్డితో జతకట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించడంతో విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో హైకమాండ్‌ జోక్యం చేసుకున్నప్పటికీ గాడిలో పడ్డట్లు కనిపించడంలేదు.

కల్వకుర్తిలో వేరుకుంపట్లు
అసమ్మతి రాజకీయాల్లో కల్వకుర్తి తనదైన ముద్ర వేస్తోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ వర్గీయులు బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న మాడ్గులలో జరిగిన ఓ కార్యక్రమంలోనే రెండు వర్గాలు కలియబడగా.. తాజాగా తలకొండపల్లి, ఆమన్ గల్‌ మండలాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మందా, జైపాల్‌యాదవ్‌ సమక్షంలో కసిరెడ్డి వైఖరిని తూర్పారబట్టడం ద్వారా అసంతృప్తిని వెళ్లగక్కారు.

తమ ఓటమికి కారణమైన నేతలను అందలం ఎక్కించడం.. కాంగ్రెస్‌ సర్పంచ్‌లకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తూ కసిరెడ్డిని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మండలి సమావేశాల నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని తప్పుబడుతూ మందా, జైపాల్‌యాదవ్‌ మాట్లాడడం పట్ల ఎమ్మెల్సీ వర్గీయులు మండిపడుతున్నారు. అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతుంటే ఓర్వలేకనే ఈ కార్యకర్తల్లో ఆగాధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

చేవెళ్లలోను సేమ్‌ సీన్
చేవెళ్ల నియోజకవర్గంలోనూ అధికారపార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే రత్నం.. ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. తనను ఓడించిన యాదయ్యను పార్టీలో చేర్చుకోవడంతో నిరాశకు గురైన రత్నం.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు పార్టీ ఫిరాయించిన యాదయ్య వర్గీయులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తన అనుచరులకు వెన్నుపోటు పొడుస్తున్నారని రత్నం మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆదివారం చేవెళ్లలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి సైతం ఆయన గైర్హాజరవడం.. సీనియర్లు ముఖం చాటేయడం చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత అంతరం పెరుగుతుందని చెప్పవచ్చు.

మహేశ్వరంలో డిష్యుం.. డిష్యుం
మహేశ్వరంలో గులాబీ రాజకీయం ఠాణాకెక్కింది. పాత, కొత్త నేతల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరి.. అది కూడా భౌతికదాడులకు దారితీసింది. పార్టీకి మొదట్నుంచి సేవలందిస్తున్న కప్పాటి పాండురంగారెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసిన కొత్త మనోహర్‌రెడ్డిలతో ప్రస్తుత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి తీవ్ర స్థాయిలో అభిప్రాయబేధాలున్నాయి. టీడీపీ నుంచి గులాబీ గూటికి చేరిన తీగల.. తన అనుచరులకే పెద్దపీట వేశారు.

తనను అనుసరించిన నేతలకు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఇది సోమవారం మహేశ్వరంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిషు్యం.. డిషు్యంకు తెరలేపింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని కప్పాటి ప్రశ్నించిన పాపానికి ఆయన మద్దతుదారులపై భౌతికదాడి జరిగింది. దీంతో సమావేశం కాస్తా రసబాసగా ముగిసింది. తన రాకతోనే పార్టీ బలోపేతమైందని.. కబడ్దార్‌! అంటూ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వైరివర్గానికి సవాల్‌ విసరడం.. ఆ తర్వాత ఈ వివాదం కాస్తా పోలీస్‌స్టేషన్ కు చేరడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement