-
ప్రారంభమైన అంతరిక్ష వారోత్సవాలు..
-
మూడు రోజుల పాటు ఉపగ్రహాలు, ఉపగ్రహ వాహక నౌకలపై అవగాహన
-
పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ ఎం 2, 3 నమూనాలు ప్రదర్శన
-
భవిష్యత్తు శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఇస్రో అడుగులు
-
ఆదిత్యకు క్యూ కడుతున్న విద్యార్థులు
-
అంతరిక్ష కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకే వారోత్సవాలు :
-
ఇస్రో డీజీఎం వెంకట సత్య వరప్రసాద్
జగ్గంపేట, గండేపల్లి :
అంతరిక్ష కార్యక్రమాలపై యువతకు అవగాహన కల్పించేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని షార్‌లో డీజీఎం హోదాలో పనిచేస్తున్న సైంటిస్టు జీ(గ్రేడ్) బి.వి.సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఇస్రో ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న అంతరిక్ష వారోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎం.ముత్యాలనాయుడు, జేఎన్‌టీయూకే రెక్టార్ డాక్టర్ బి.ప్రభాకరరావు, ఇస్రో జీఎం ఎం.నాగసత్యనారాయణ, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి పాల్గొన్నారు. డీజీఎం సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు శాస్త్రసాంకేతిక రంగాలపై ఆకర్షితులవ్వాలన్నారు. ఇస్రో ద్వారా అనేక ఉపగ్రహాలను తయారీ చేసి అంతరిక్షానికి పంపుతున్నామన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ముత్యాలనాయుడు మాట్లాడుతూ వరల్డ్ స్పేస్ వీక్ –2016 కార్యక్రమాన్ని ఇస్రో నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశానికి ఇస్రో సేవలు అజరామమన్నారు. కార్యక్రమంలో ఆదిత్య వైస్ చైర్మన్ ఎన్.సతీష్‌రెడ్డి, శాస్త్రవేత్తలు, షార్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు..
ఇస్రో, సతీస్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్) అధికారుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు షార్ అధికారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తయారు చేసిన ఉపగ్రహాలు, వాటిని కక్ష్యలోకి తీసుకువెళ్లే వాహకాల గురించి ప్లెక్స్ ద్వారా శాస్త్రవేత్తలు, టెక్నికల్ సిబ్బంది విద్యార్థులకు వివరించారు. జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు ఐదు వేల మంది విద్యార్థులు హాజరై అంతరిక్ష పరిశోధనల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఉపగ్రహాలను ఆకాశంలోకి తీసుకువెళ్లే పోలార్ శాటిలైట్ లాంచ్‌వెహికల్(పీఎస్‌ఎల్‌వీ), జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ) ఎం2, జీఎస్‌ఎల్ ఎం3లను ప్రదర్శించారు. రాకెట్‌ల పనితీరును శాస్త్రవేత్తను అడిగి తెలుసుకున్నారు. షార్‌లో డీజీఎంగా పనిచేస్తున్న సైంటిస్ట్ బీవీ సత్యప్రసాద్, జీఎం ఎంఎన్ సత్యనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్ వాటి గురించి విద్యార్థులకు వివరించడంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సైంటిస్ట్‌లు, విద్యార్థులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
ఉపగ్రహాల గురించి అవగాహన కల్పించారు
ఉపగ్రహాలు, వాటి ప్రయోగం గురించి పుస్తకాల్లో చదవడం, టీవీల్లో చూడడం చేసేవాళ్లం. తొలిసారిగా ఇస్రో ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయోగాల గురించి తెలుసుకోగలిగాం.
– ఎస్.దేవి. కంప్యూటర్ సైన్స్, ఫైనల్ ఇయర్, ధర్మవరం
మరిన్ని మోడల్స్ ఉంటే బాగుండేవి
అంతరిక్ష వారోత్సవాలు పేరిట విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బాగుంది. రాకెట్‌ల నమునాలు ప్రదర్శించారు. మరిన్ని మోడల్స్ ప్రదర్శించి ఉంటే బాగుండేది.
– వి.రాజేష్, ఈసీఈ సెకండియర్, రాజమహేంద్రవరం
వీడియో ద్వారా ఉపగ్రహ ప్రయోగంపై అవగాహన బాగుంది
ఉపగ్రహాల ప్రయోగ విధానం వీడియోల ద్వారా ప్రదర్శించి చూపడం బాగుంది. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాలు, వాటి ప్రయోగం గురించి విద్యార్థులకు తెలియజేయడం అభినందనీయం.
– జి.దీపక్, ఈసీఈ సెకండియర్, తుని
విద్యార్థులకు అవగాహన కోసమే ప్రదర్శన
విద్యార్థులకు అవగాహన కోసమే ఉపగ్రహ వాహకాల నమునాలను ఏర్పాటు చేశాం. ఇస్రో, షార్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను ప్రధానంగా మూడు రోజులపాటు అవగాహన కల్పిస్తాం.
– ప్రకాష్, ఇస్రో టెక్నికల్ అసిస్టెంట్, శ్రీహరికోట.