ఆర్ట్స్ కళాశాలలో ప్లాస్టిక్ బియ్యం కలకలం
కళాశాల వద్ద విద్యార్థుల ధర్నా
భోజనంలో నాణ్యత లోపించిందంటూ ఆరోపణ
ప్రిన్సిపల్, వార్డన్‌ను సస్పెన్షన్‌కు డిమాండ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు గురువారం ఆకలికేకలు పెట్టారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన భోజనం పెడుతున్నారంటూ కళాశాల, హాస్టల్‌తో పాటు టవర్‌క్లాక్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. వందలాది మంది విద్యార్థులు భోజనం తినకుండా ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. భోజనం నాణ్యతపై ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మరుగుదొడ్లు చాలడం లేదని, ఉన్న మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా ఉన్నాయన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్, వార్డెన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. విద్యార్థులతో డీఎస్పీ చర్చలు జరిపారు. స్వయంగా హాస్టల్‌కు వెళ్లి భోజనం రుచి చూశారు. అన్నం చేయడానికి వాడుతున్న బియ్యంపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు వచ్చి భోజనాన్ని పరిశీలించారు. శాంపిల్ తీసుకుని పరిశీలనకు ల్యాబ్‌కు పంపుతామని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని యాజమాన్యానికి డీఎస్పీ సూచించారు.